నేడు ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:43 AM
ఓలా, ఊబర్, ర్యాపిడో తదితర ప్లాట్‌ఫాంలలో పనిచేస్తున్న బైకులు, ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్లు 7వ తేదీ, శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఓలా, ఊబర్, ర్యాపిడో తదితర ప్లాట్‌ఫాంలలో పనిచేస్తున్న బైకులు, ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్లు 7వ తేదీ, శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఆయా యాప్‌ల ఆధారంగా పని చేస్తున్న డ్రైవర్లు కనీసం ఆరు గంటలపాటు తమ సేవలను బహిష్కరించాలని నిర్ణయించారు. తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) ఇచ్చిన ఈ దేశవ్యాప్త సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. కనీస చార్జీలు, మెరుగైన పని పరిస్థితులు, ప్రైవేటు వాహనాలను వాణిజ్య అవసరాలకు వాడడాన్ని నిరోధించాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె ప్రభావం ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆటోలు, క్యాబ్‌లపై ఎక్కువగా ఆధారపడిన నగరాల్లో ఈ ప్రభావం విస్తృతంగా ఉండవచ్చు. ఆయా యాప్‌లపై ఆధారపడి నిత్యం ప్రయాణించేవారు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడే అవకాశముంది.