ఏఐ దూకుడుకు ఎన్‌విడియా కళ్లెం
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:25 AM
కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లు కట్టుతప్పకుండా వాటిని నియంత్రించే సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌నొకదాన్ని దిగ్గజ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియా విడుదల చేసింది.
ఏఐ కట్టుతప్పకుండా నియంత్రించే సాఫ్ట్‌వేర్ విడుదల
న్యూయార్క్, సెప్టెంబరు 29: కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లు కట్టుతప్పకుండా వాటిని నియంత్రించే సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌నొకదాన్ని దిగ్గజ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియా విడుదల చేసింది. దాని పేరు.. ‘ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌పామ్’. చాట్‌జీపీటీ, జెమెనై, క్లాడ్, గ్రోక్ వంటి ఏఐ ఏజెంట్లు ఇష్టానుసారంగా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల సర్వర్లలోకి చొరబడకుండా కేవలం తమకు అనుమతి ఉన్న పనులు మాత్రమే చేసే నియంత్రిత వాతావరణాన్ని ఈ ప్లాట్‌ఫామ్ సృష్టిస్తుందని ఎన్‌విడియా సీఈవో జెన్‌సెన్ హువాంగ్ తెలిపారు. అందులో భాగంగా ఈ ప్లాట్‌ఫామ్‌లో రెండు రక్షణ వలయాలుంటాయి. ఒకటి.. ఓపెన్‌షెల్. ఇది సీపీయూ, జీపీయూల స్థాయిలో పనిచేస్తుంది. అంటే.. ఏఐ మోళ్లు మన కంప్యూటర్/ఫోన్‌లోపల చేయకూడని పనులేవైనా చేస్తుంటే ఆపుతుంది. రెండోది సెంట్రీ. ఇది నెట్‌వర్క్ చిప్స్ స్థాయిలో పనిచేస్తుంది. అంటే.. ఏఐ మోడళ్లు మనం చెప్పే పనులు చేయడానికి హ్యాకింగ్‌కు పాల్పడే ప్రయత్నం చేస్తే నిరోధించే వ్యవస్థ. ఇలా రెండు దశల్లోనూ ఏఐని నియంత్రించగలిగితే అది పూర్తిగా మానవుల అదుపాజ్ఞల్లో ఉంటుందన్నది ఎన్‌విడియా ఆలోచన.