పుదుచ్చేరిలో మళ్లీ..
ABN , Publish Date - May 05 , 2026 | 04:58 AM
పుదుచ్చేరి ఓటర్లు మరోసారి ఎన్డీయేకే పట్టం కట్టారు. మొత్తం 30 స్థానాల్లో ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 18 సీట్లు గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది.
అధికారం నిలబెట్టుకున్న ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్
కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్‌కు నిరాశే
టీవీకేకు 2 స్థానాలు.. ఐదోసారి సీఎం కానున్న రంగస్వామి
న్యూఢిల్లీ, మే 4: పుదుచ్చేరి ఓటర్లు మరోసారి ఎన్డీయేకే పట్టం కట్టారు. మొత్తం 30 స్థానాల్లో ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 18 సీట్లు గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. కూటమిలోని ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు 12 స్థానాలు, బీజేపీకి 4 స్థానాలు లభించాయి. ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, తాను బరిలో నిలిచిన రెండు స్థానాల నుంచీ విజయం సాధించారు. ఆయన తట్టంచవడి నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి నెయ్యం మక్కల్ కళగం అభ్యర్థి ఈ. వినాయగంపై 4,441 ఓట్ల తేడాతో, మనగలం నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి ఎస్ రంగన్‌పై 7050 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2021 ఎన్నికల్లోనూ ఆయన యానాం, తట్టంచవడి స్థానాల నుంచి పోటీ చేశారు. అప్పట్లోనూ రెండుచోట్లా గెలిచారు. అయితే యానాం సీటును వదులుకొని, తట్టంచవడిని అట్టిపెట్టుకున్నారు. కాగా 30 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ 6 స్థానాలు గెలుచుకుంది. ఈ కూటమిలో కాంగ్రెస్‌కు ఒక స్థానం, డీఎంకేకు ఐదు స్థానాలు దక్కాయి. ఇక విజయ్ పార్టీ టీవీకే రెండు స్థానాలు గెలుచుకోవడం విశేషం. అన్నాడీఎంకే, ఎల్‌జీకే, నెయ్యం మక్కల్ కళగమ్ ఒక్కో స్థానంలో, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. రంగస్వామి క్యాబినెట్‌లోని మంత్రులు తిరుమురుగన్ (కారైకాల్ నార్త్), వీపీ శివకొలుందు (లాస్పేట్) గెలుపొందారు. గత ఎన్నికల్లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సరిగ్గా సాధారణ మెజారిటీ అయిన 16 స్థానాలను సాధించింది. ఇందులో ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు 10 స్థానాలు, బీజేపీకి 6 స్థానాలు దక్కాయి. అప్పట్లో డీఎంకేకు 6, కాంగ్రెస్‌కు 2 సీట్లు, ఇతరులకు 6 సీట్లు లభించాయి. ఈసారీ రంగస్వామియే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నాలుగుసార్లు (2001-2006, 2006-2008, 2011-16, 2021-26) ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పుదుచ్చేరిలో సొంత పార్టీ పెట్టిన మూడు నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.