Share News

నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:25 AM

కనీస వేతనం రూ.20 వేలకు పెంపు, 8 గంటల పని తదితర డిమాండ్లతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది.

నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం

  • వాహనాలకు నిప్పు, రోడ్ల దిగ్బంధం

  • ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

  • రూ.20 వేల కనీస వేతనం, 8 గంటల పని తదితర డిమాండ్లతో కార్మికుల ఆందోళనలు

న్యూఢిల్లీ/నోయిడా, ఏప్రిల్‌ 13: కనీస వేతనం రూ.20 వేలకు పెంపు, 8 గంటల పని తదితర డిమాండ్లతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపైకి వందలాదిగా చేరుకున్న కార్మికులు భద్రతా సిబ్బందిపై రాళ్లు విసరడం, వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు జాతీయ రహదారి-9తో పాటు పలు రోడ్లను దిగ్బంధించారు. దీంతో కీలకమైన ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. రహదారులపై వాహనాలు కొన్ని గంటల పాటు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించడంతో ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఫేజ్‌-2 ఏరియాలో కార్మికులు రెండు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు మరో రెండు బైక్‌లకు నిప్పుపెట్టారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బంది, పరిశ్రమల భవనాలపై ఆందోళనకారులు రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. పరిస్థితులను నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కార్మికుల ఆందోళనల నేపథ్యంలో నోయిడా అథారిటీలో అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం, ఓవర్‌ టైమ్‌కు రెట్టింపు వేతనాలు, బోన్‌సల చెల్లింపు, వారంతపు సెలవులు, పని ప్రదేశంలో మెరుగైన పరిస్థితులు కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. తక్కువ వేతనాలతో పడుతున్న వెతలపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.15 వేల కంటే తక్కువ జీతంతో ఎలా బతకాలని ప్రశ్నించారు. రోజుకు 12 గంటల పని కూడా చేయించుకుంటున్నారని కొంత మంది చెప్పారు. హరియాణలోని గుర్‌గావ్‌ పారిశ్రామిక బెల్ట్‌లో ఈనెల మొదట్లో కార్మికులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాన్ని వారి నైపుణ్య స్థాయిలను బట్టి 35ు వరకు పెంచింది. ఈ నేపథ్యంలో తమకు కూడా అదేవిధంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ యూపీలోని నోయిడాలో కూడా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కార్మికుల ఆందోళనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. ప్రతి కార్మికుడు గౌరవప్రదమైన వేతనం పొందాలన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 04:25 AM