10 కిలోల వంటగ్యాస్.. నిజం కాదు: కేంద్రం
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:40 AM
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. సిలిండర్లలో వంటగ్యాస్ మోతాదును తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వరంగ చమురు సంస్థలు పరిశీలిస్తున్నాయంటూ సోమవారం ఊహాగానాలు చెలరేగాయి.
న్యూఢిల్లీ, మార్చి 23: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. సిలిండర్లలో వంటగ్యాస్ మోతాదును తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వరంగ చమురు సంస్థలు పరిశీలిస్తున్నాయంటూ సోమవారం ఊహాగానాలు చెలరేగాయి. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వార్త వెలువడింది. ప్రస్తుత 14.2 కిలోల సిలిండర్లలోనే 10 కిలోల ఎల్‌పీజీని నింపి, ధర తగ్గించి సరఫరా చేయాలనే ప్రణాళిక ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా ఎక్కువ ఇళ్లకు వంటగ్యాస్ సరఫరా చేయవచ్చని తెలిపాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని, పది కిలోల ఎల్‌పీజీని సరఫరా చేయాలనే ఆలోచన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతశర్మ స్పష్టం చేశారు. కాగా, దేశంలో రోజువారీ ఎల్‌పీజీ వినియోగం 93,500 టన్నులు కాగా.. దాంట్లో గృహ వినియోగమే 80,400 టన్నులు. ఈ నెల తొలి రెండు వారాల్లో ఎల్‌పీజీ వినియోగం మొత్తంగా 17 శాతం తగ్గింది.