Vaishno Devi Medical College: వైష్ణోదేవి మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:03 AM
కనీస ప్రమాణాలు పాటించడంలో విఫలమైన వైష్ణోదేవి వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) రద్దు చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 7: కనీస ప్రమాణాలు పాటించడంలో విఫలమైన వైష్ణోదేవి వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) రద్దు చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 50 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సు నిర్వహించడానికి జమ్మూ కశ్మీర్‌లోని రియాసీలో ఉన్న శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌లెన్స్‌కు మంజూరు చేసిన అనుమతి పత్రాన్ని(ఎల్‌వోపీ) ఎన్‌ఎంసీకి చెందిన మెడికల్ ఎసె్‌సమెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఏఆర్‌బీ) తాజాగా ఉపసంహరించుకుంది. ఈ కాలేజీలో తొలి బ్యాచ్ కోసం ఎంపిక చేసిన 50 మందిలో 42మంది ముస్లింలు కాగా ఒకరు సిక్కు విద్యార్థి ఉండటంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. వైష్ణోదేవి మందిరానికి వచ్చే విరాళాలతో నడిచే కళాశాలలో హిందూ విద్యార్థులకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాలు నిరసనలకు దిగాయి. ఇదే సమయంలో ఈ కళాశాలలో తగిన మౌలిక సదుపాయాలు లేవని, వైద్య పరికరాల కొరత, అర్హత కలిగిన అధ్యాపకుల్లేరంటూ ఎన్‌ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో ఈ కళాశాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఎన్‌ఎంసీ పేర్కొంది.