ఎన్‌ఎంసీ తప్పిదం.. వైద్య విద్యార్థులకు శాపం!
ABN , Publish Date - May 31 , 2026 | 04:59 AM
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 160 మందికి పైగా వైద్య విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఎన్‌ఎంసీ 2021లో సరికొత్త విధానం తెరపైకి తీసుకువచ్చింది.
ఫైనల్ పరీక్షల్లో ఏపీకి చెందిన 160 మందికి పైగా ఫెయిల్
(అమరావతి/గుంటూరు మెడికల్- ఆంధ్రజ్యోతి)
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 160 మందికి పైగా వైద్య విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఎన్‌ఎంసీ 2021లో సరికొత్త విధానం తెరపైకి తీసుకువచ్చింది. నాన్-క్లినికల్ విభాగానికి చెందిన సబ్జెక్టులకు పార్ట్-1 (మూడో ఏడాది ఎంబీబీఎ్‌స)లో, క్లినికల్ విభాగానికి చెందిన సబ్జెక్ట్‌లకు పార్ట్-2 (చివరి ఏడాది ఎంబీబీఎ్‌స)లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని దేశంలోని అన్ని హెల్త్ వర్సిటీలు అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇదే సమయంలో ఆరు క్లినికల్ సబ్జెక్టులకు తామే స్వయంగా పరీక్షలు నిర్వహిస్తామని కూడా ఎన్‌ఎంసీ పేర్కొంది. అయితే ఆ తర్వాత ఎన్‌ఎంసీ తీసుకువచ్చిన కొత్త విధానాన్ని అక్కడి అధికారులే మర్చిపోయారు. దీనిపై హెల్త్ వర్సిటీలు అనేకసార్లు ఎన్‌ఎంసీకి లేఖలు రాసినా స్పందన లేదు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు ఎన్‌ఎంసీ డైరెక్టర్ ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో ఈ అంశంపై చర్చించారు. ఈ ఏడాదికి అన్ని సబ్జెక్టులకు మీరే పరీక్షలు నిర్వహించాలని ఎన్‌ఎంసీ డైరెక్టర్ చివరి నిమిషంలో తేల్చిచెప్పారు. దీంతో హెల్త్ వర్సిటీకి వేరే దారి లేక ఎన్‌ఎంసీ డైరెక్టర్ ఆదేశాల మేరకు పార్ట్-1 క్లినికల్ సబ్జెక్టుల పరీక్షలను కూడా పార్ట్-2లో నిర్వహించారు. దీంతో ఎంబీబీఎస్ చివరి ఏడాది విద్యార్థులంతా పార్ట్-2లో ఆరు క్లినికల్ సబ్జెక్టులకు సంబంధించి ఒకేసారి తొమ్మిది పేపర్లకు పరీక్షలు రాయాల్సి వచ్చింది. రోజు మార్చి రోజు 18 రోజుల పాటు తొమ్మిది పేపర్లకు పరీక్షలు రాసిన వైద్య వి ద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వారం కిందట వర్సిటీ ప్రకటించిన పరీక్ష ఫలితాలు షాక్ కలిగిం చాయి. ఎన్‌ఎంసీ నిర్లక్ష్యం కారణంగా పైనల్ ఎంబీబీఎస్ ఎగ్జామ్‌లో 160 మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వారిలో గోల్డ్ మెడలిస్టులు, ప్రతిభ గల విద్యార్థులు ఉండడం గమనార్హం. హెల్త్ వర్సిటీలో ప్రతి ఏటా 90 శాతంపైనే పాస్ పర్సంటేజ్ ఉంటుంది. ఈ ఏడాది 86ు మంది మాత్రమే పాస్ అయ్యారు.
గ్రేస్ మార్కులపైనే ఆశ
ఎంబీబీఎస్ పరీక్షల్లో రీవాల్యూయేషన్‌కు అవకాశం లేకపోవడంతో ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. చాలా మంది 2-3 మార్కుల తక్కువతో ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఈ బ్యాచ్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఐదు గ్రేస్ మార్కులు కలిపితే కనీసం కొంత మందికైనా ఊరట కలుగుతుందని, దీనిపై వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించి తగిన ఆదేశాలు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.