బిహార్‌పై చెరగని ముద్ర
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:10 AM
బిహార్ సీఎంగా సుదీర్ఘకాలంపాటు బాధ్యతలు నిర్వర్తించి మంగళవారం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్.. ఆ రాష్ట్రంపై తనదైన ముద్ర వేసిన నాయకుడు.
20 ఏళ్ల పాటు సీఎంగా నితీశ్
పాట్నా, ఏప్రిల్ 14: బిహార్ సీఎంగా సుదీర్ఘకాలంపాటు బాధ్యతలు నిర్వర్తించి మంగళవారం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్.. ఆ రాష్ట్రంపై తనదైన ముద్ర వేసిన నాయకుడు. ఆయన అభిమానులు నితీశ్ కుమార్‌ను ఆధునిక బిహార్ రూపశిల్పి అని అభివర్ణిస్తుంటారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పలుమార్లు కూటములు మార్చిన నితీశ్‌ను విమర్శకులు పల్టూరామ్ అని ఎద్దేవా చేస్తుంటారు. అయితే, బీజేపీతో చెలిమి చేసినప్పటికీ.. లౌకికవాదం, సామాజిక న్యాయం విషయంలో ఆయన చూపించే శ్రద్ధను వాళ్లు కూడా కాదనలేరు. మొత్తంగా, బిహార్ రాజకీయాలు గత 20 ఏళ్లుగా నితీశ్ కేంద్రంగానే నడిచియాంటే, ఆ రాష్ట్రంలో ఒక తరానికి ముఖ్యమంత్రి అంటే నితీశేనంటే అతిశయోక్తి కాదు. 1970లలో దేశంలో ముఖ్యంగా హిందీ భాషా రాష్ట్రాల్లో సోషలిస్టు ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ ఉద్యమాల సందర్భంగానే నితీశ్, లాలూ, ములాయం, శరద్ యాదవ్ వంటి యువ నాయకులు రాజకీయాలవైపు వచ్చారు. జయప్రకాశ్ నారాయణ్ తీసుకొచ్చిన ‘సంపూర్ణ విప్లవం’ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా నితీశ్ చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొని కొంతకాలం జైలు జీవితం గడిపారు. తర్వాత కాలంలో ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 1985లో తొలిసారిగా బిహార్ శాసనసభకు జనతాదళ్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో లాలూ, నితీశ్‌ల మధ్య గట్టి స్నేహబంధం ఉండేది. 1989లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న లాలూకు నితీశ్ పూర్తి సహకారం అందించేవారు. 1994లో జార్జ్ ఫెర్నాండేజ్‌తో కలిసి సమతాపార్టీని ఏర్పాటు చేశారు. తర్వాత రెండేళ్లకు మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్‌డీఏ కూటమిలో చేరి వాజపేయి నేతృతంలోని ప్రభుత్వంలో తొలుత రైల్వే మంత్రిగా (1998-99) పని చేశారు. 2000లో బిహార్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పాటైన నేపథ్యంలో ఎన్‌డీఏ పక్షాన సీఎంగా తొలిసారి నితీశ్ పగ్గాలు చేపట్టారు. అయితే, మెజారిటీ లేకపోవటంతో వారం రోజుల్లోనే పదవి నుంచి వైదొలిగారు. 2003లో సమతాపార్టీని జేడీయూలో విలీనం చేసి దాని సారథ్య బాధ్యతలు చేపట్టారు. 2005లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి విజయం సాధించి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచీ రాష్ట్ర రాజకీయాల్లో నితీశ్‌కు ఎదురు లేకుండా పోయింది.
సీఎంగా పలు సంస్కరణలు
అంతకుముందటి ప్రభుత్వాలను నడిపిన లాలూ, ఆయన భార్య రబ్రీదేవి హయాంలో బిహార్‌లో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయన్న విమర్శలు వచ్చాయి. దీంతో శాంతిభద్రతలను గాడిలో పెట్టటానికి నితీశ్ ప్రాధాన్యం ఇచ్చారు. పోలీసుశాఖను బలోపేతం చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి చర్యలు తీసుకున్నారు. మద్యంపై నిషేధం విధించారు. 2013లో ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించటంతో.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ కూటమి నుంచి నితీశ్ బయటకొచ్చారు. ఆర్జేడీ, కాంగ్రె్‌సతో కలిసి మహాఘట్‌బంధన్ పేరిట కొత్త కూటమి ఏర్పాటు చేసి అధికారాన్ని కొనసాగించారు. 2017లో ఆ కూటమి నుంచి బయటకొచ్చి తిరిగి బీజేపీతో కలిశారు. 2022లో మరోసారి మహాఘట్‌బంధన్‌తో జతకట్టారు. 2024లో లోక్‌సభ ఎన్నికల ముంగిట మరోసారి ఆ కూటమికి గుడ్‌బై చెప్పి.. మళ్లీ ఎన్‌డీఏలో చేరారు. ఈ విధంగా కూటములను మార్చటంతో ఆయనకు పల్టూరాం అనే పేరొచ్చింది. ఎన్నిసార్లు కూటములు మార్చినా.. సీఎం సీటును మాత్రం నితీశ్ పదిలపర్చుకునేవారు. మొత్తంగా 20 ఏళ్లలో పదిసార్లు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.
కుటుంబ నేపథ్యం
నలందా జిల్లాలోని కల్యాణ్ బిఘా అనే గ్రామంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో నితీశ్ 1951లో జన్మించారు. ఆయన తండ్రి ఆయుర్వేద వైద్యుడిగా పని చేసేవారు. వారి సామాజిక వర్గం కుర్మి. రాష్ట్రంలోని బీసీ కులాల్లో ఒక ప్రముఖ వర్గం. 1972లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితీశ్.. రాష్ట్ర విద్యుత్ బోర్డులో ఉద్యోగంలో చేరారు. అయితే, రాజకీయాలపై ఆసక్తితో ఎక్కువ కాలం ఉద్యోగంలో కొనసాగలేదు. నితీశ్‌కు 1973లో మంజుసిన్హాతో వివాహమైంది. వారికి ఒక కుమారుడు. పేరు నిశాంత్ కుమార్. నిమోనియా కారణంగా మంజుసిన్హా 2007లో మరణించారు.