అనవసరంగా ఢిల్లీకి రావొద్దు
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:09 AM
ఢిల్లీకి తరచుగా రావడం కంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని బీజేపీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇన్‌చార్జిలు, సహ ఇన్‌చార్జిలకు ఆ పార్టీ అధ్యక్షుడు నితీన్ నబీన్ స్పష్టం చేశారు.
కొందరు తరచూ వచ్చి సీనియర్లను
కలిసి సమయం వృథా చేస్తున్నారు
క్షేత్రస్థాయిలో పార్టీపై దృష్టి పెట్టండి
బూత్‌స్థాయిలో క్రమం తప్పకుండా
సంస్థాగత భేటీలు నిర్వహించండి
బాధ్యతగా ఉండండి.. మిమ్మల్ని
మేం చూసుకుంటాం: నబీన్
రాష్ట్రాల బీజేపీ ఇన్‌చార్జిలు,
సహ ఇన్‌చార్జిలకు దిశానిర్దేశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీకి తరచుగా రావడం కంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని బీజేపీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇన్‌చార్జిలు, సహ ఇన్‌చార్జిలకు ఆ పార్టీ అధ్యక్షుడు నితీన్ నబీన్ స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనవసరంగా ఢిల్లీకి రావొద్దని, బాధ్యతలు కేటాయించిన రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా పర్యటించి పార్టీని విస్తరించాలని ఆదేశించారు. కొందరు నేతలు తరచుగా ఢిల్లీకి వచ్చి పార్టీ సీనియర్ నేతలతో భేటీలకే ప్రాధాన్యమిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని.. కొత్త ఇన్‌చార్జిలు, సహ ఇన్‌చార్జిలు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని నితిన్ నబీన్ ఉద్భోధించారు. మంగళవారం, పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇటీవల కొత్తగా నియమితులైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పార్టీ ఇన్‌చార్జిలు, సహ ఇన్‌చార్జిలతో నబీన్ సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. ఇటీవల దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ సంస్థాగత పునర్వ్యస్థీకరణ జరిగిన నేపథ్యంలో తొలిసారి ఈ భేటీ జరిగింది.
ఈ భేటీలో పార్టీని బలోపేతం చేయడం, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు, క్షేత్రస్థాయిలో వివిధ వర్గాలలో పార్టీ ప్రాబల్యాన్ని విస్తరించడంపై చర్చించారు. తమకు అప్పగించిన బాధ్యతను ప్రాథమిక ప్రాధాన్యంగా గుర్తించి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాలని నబీన్ సూచించారు.
ఇన్‌చార్జిలు, సహ ఇన్‌చార్జిలు క్రమం తప్పకుండా తమ బాధ్యతలు అప్పగించిన రాష్ట్రాలకు వెళ్లాలని, రాష్ట్ర పార్టీ విభాగాలతో నిరంతరం టచ్‌లో ఉండాలని ఆదేశించారు. బూత్‌స్థాయిలో క్రమం తప్పకుండా సంస్థాగత సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన అభిప్రాయాలను కేంద్రనాయకత్వానికి తెలియజేయాలని ఆదేశించారు. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత కార్యకలపాలు, క్షేత్రస్థాయికి చేరేలా చూడాలని, పార్టీ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించాలని కోరారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తరుచుగా పర్యటించాలని, ఎన్నికల సన్నాహాక కార్యకలపాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒడిసా ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి, ఉత్తరాఖండ్, తమిళనాడు ఇన్‌చార్జి రాంమాధవ్, కర్ణాటక సహ ఇన్‌చార్జి డాక్టర్ వెంకటేశ్వర్లు, తమిళనాడు సహ ఇన్‌చార్జి డీకే అరుణ పాల్గొన్నారు. దసరా తర్వాత తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఇటీవల తెలంగాణ ఇన్‌చార్జిగా నియమితులైన సునీల్ బన్సల్ దసరా తర్వాత రాష్ట్రంలో పార్టీ తరపున ప్రభుత్వ వైఫల్యాలపై క్రమం తప్పకుండా పోరాటం చేసేలా కార్యచరణ రూపొందించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకవచ్చేందుకే రాష్ట్ర బాధ్యతలను పట్టుబట్టి తీసుకున్నానని, పశ్చిమబెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో పార్టీని గెలిపించానని, తెలంగాణలో పార్టీని గెలిపిస్తేనే ఆ విజయం తన సామర్థ్యానికి గీటురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తెలంగాణలో పార్టీ బాధ్యతల కోసం అమిత్ షా దగ్గర పట్టుబట్టినట్లు తెలిపాయి. పార్టీ బలోపేతంతో పాటు నేతల ఐక్యతపై దృష్టి సారిస్తానని బన్సల్ చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి.