Share News

రాహుల్‌ గాంధీతో దేశంలో అరాచకత్వం

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:29 AM

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దేశంలో అరాచకత్వాన్ని సృష్టిస్తున్నారని, దీన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు.

రాహుల్‌ గాంధీతో దేశంలో అరాచకత్వం

  • బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

న్యూఢిల్లీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దేశంలో అరాచకత్వాన్ని సృష్టిస్తున్నారని, దీన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు. నవంబరు 1వ తేదీ కాంగ్రెస్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేసి, ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన రోజు అని, రాజకీయ ప్రదర్శనలు చేసే రోజు కాదని విమర్శించారు. 1984 నవంబరు 1న జరిగిన సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్‌ ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదన్నారు. వరుస ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజ్యాంగ సంస్థలు, ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇండియా కూటమి ర్యాలీకి కౌంటర్‌గా ఆదివారం నితిన్‌ నబీన్‌ నాయకత్వంలో హరియాణాలోని రోహతక్‌లో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి- అరాచకత్వాన్ని నిర్మూలించండి’ పేరిట పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని విమర్శించారు. సర్‌ ప్రక్రియలో ఓట్లు తొలగించినవారిలో 3 కోట్ల మంది చొరబాటుదారులు ఉన్నారని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలపై విశ్వాసం లేని కాంగ్రెస్‌.. చొరబాటుదారులను నమ్ముకుందని విమర్శించారు.

Updated Date - Nov 02 , 2026 | 02:30 AM