జాప్యానికి సిగ్గుపడుతున్నా..!
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:43 AM
ముంబై-గోవా జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా సాగుతుండటంపై కేంద్రం రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముంబై-గోవా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవానికి రాను
కాంట్రాక్టర్ల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి: గడ్కరీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ముంబై-గోవా జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా సాగుతుండటంపై కేంద్రం రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంత కాలం పట్టడం పట్ల సిగ్గు పడుతున్నానని.. అందుకే రహదారి ప్రారంభోత్సవానికి హాజరుకాబోనని చెప్పా రు. గురువారం గోవాలోని పోర్వోరిమ్‌లో ఆరు వరుసల ఎలివేటేడ్ రోడ్ కారిడార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ముంబై-గోవా హైవే విస్తరణ పనులు చాలా ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయని.. దీనికి కాంట్రాక్టర్ల వైఫల్యమే ప్రధాన కారణమన్నారు. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించబోమని.. బాధ్యతారాహిత్యంగా పనిచేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో అధికారులను సస్పెండ్ చేసి ఈ ఏడాది రికార్డు సృష్టిస్తామన్నారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు తానే స్వయంగా అక్టోబరులో ముంబై-గోవా వరకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తానని ఆయన చెప్పారు.