నిఫా కలకలం.. ఆసియా దేశాలు అప్రమత్తం
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:09 AM
భారత్‌లో ఇటీవల నిఫా వైరస్ కేసులు బయటపడడం ఆసియా దేశాల్లో కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఐదుగురు ఆరోగ్య సిబ్బంది నిఫా వైరస్ బారినపడినట్టు ఇటీవల నిర్ధారణ అయింది.
న్యూఢిల్లీ, జనవరి 27: భారత్‌లో ఇటీవల నిఫా వైరస్ కేసులు బయటపడడం ఆసియా దేశాల్లో కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఐదుగురు ఆరోగ్య సిబ్బంది నిఫా వైరస్ బారినపడినట్టు ఇటీవల నిర్ధారణ అయింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో వారిని కలిసిన 110 మందిని క్వా రంటైన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసియా దేశాలు అప్రమత్తమై నిబంధనలను కఠినతరం చేశాయి. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే ప్రయాణికులను థాయ్‌లాండ్‌లోని 3ఎయిర్‌పోర్టుల్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నేపాల్ కూడా ఖాట్మండు విమానాశ్రయంతోపాటు భూ సరిహద్దుల ద్వారా తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని స్ర్కీనింగ్ చేస్తోంది. జంతువుల నుంచి మనుషులకు సోకే నిఫా వైరస్ కు చికిత్సకు వ్యాక్సిన్, మందులు లేవు కాబట్టి మరణాల రేటు అధికంగా ఉంటుంది.