పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో పురోగతి
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:24 AM
పహల్గాం ఉగ్రదాడిలో వినియోగించినట్టు భావిస్తున్న గోప్రో హీరో 12 కెమెరాకు సంబంధించిన వివరాల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ...
న్యూఢిల్లీ, మార్చి 3: పహల్గాం ఉగ్రదాడిలో వినియోగించినట్టు భావిస్తున్న గోప్రో హీరో 12 కెమెరాకు సంబంధించిన వివరాల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చైనాను ఆశ్రయించింది. కేసు దర్యాప్తులో భాగం గా ఉగ్రదాడి అమలు, కుట్రకు వినియోగించిన వివిధ వస్తువులు, ఎలక్ర్టానిక్ పరికరాలను ఎన్‌ఐఏ పరిశీలించింది. వాటిలో కీలకమైనది సీ3501325471706 అనే సీరియల్ నంబరు కలిగిన గోప్రో హీరో 12 బ్లాక్ కెమెరా. ఉగ్రదాడికి ముందు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించేందుకు, జన సంచారాన్ని పరిశీలించేందుకు ఆ కెమెరాను వినియోగించినట్టు గుర్తించారు. ఆ కెమెరాను కొన్నవారి వివరాల కోసం నెదర్లాండ్స్‌లోని తయారీదారు ‘గోప్రో బి.వి.’ను ఎన్‌ఐఏ సంప్రదించింది. ఆ కెమెరాను చైనాలోని డిస్ర్టిబ్యూటర్ ‘ఈఏ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’కు సరఫరా చేశామని, 2024 జనవరి 30న చైనాలోని డాంగువాన్ ప్రాంతంలో కెమెరాను యాక్టివేట్ చేశారని గోప్రో బి.వి. తెలిపింది. దీంతో చైనా నుంచి ఆ వివరాలు పొందేందుకు న్యాయపరమైన అభ్యర్థన కోసం లెటర్ రోగేటరీ(ఎల్‌ఆర్) జారీ చేయడానికి జమ్మూలోని కోర్టులో ఎన్‌ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. ఆమేరకు చైనాకు ఎల్‌ఆర్ జారీ చేయడానికి ఎన్‌ఐఏకు అనుమతిస్తూ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.