Share News

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ

ABN , Publish Date - Jun 27 , 2026 | 08:13 PM

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ మరో ముగ్గురు నిందితులపై అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ
NIA Files Supplementary Chargesheet in Red Fort Car Blast Case

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ మరో ముగ్గురు నిందితులపై అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ముజఫర్‌ అహ్మద్ అలియాస్ ఫరాజ్ అలియాస్ జఫర్‌తో పాటు జమీర్ అహ్మద్ అహాంగర్, తుఫెయిల్ అహ్మద్ భట్‌ పేర్లను చార్జ్‌ షీట్‌లో పేర్కొంది. నిందితులు ముగ్గురూ జమ్మూకశ్మీర్‌కు చెందిన వారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. తాజా చార్జ్‌షీట్‌తో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 13కు పెరిగింది.


పరారీలో ఉన్న ముజఫర్ అహ్మద్ పిడియాట్రీషియన్ అని ఎన్ఐఏ పేర్కొంది. అతడు ఎండీ కూడా చేశాడని వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డా. అదిల్ అహ్మద్ రాథార్‌కు డా. ముజఫర్ సోదరుడని తెలిపింది. అల్ ఖైదా అనుబంధ ఉగ్రసంస్థ ఏజీయూహెచ్ వ్యవస్థాపక సభ్యుడని కూడా పేర్కొంది. గతేడాది నవంబర్ 10న ఎర్ర కోట సమీపంలో కారు బాంబు పేలుడుకు కుట్రపన్నిన వారిలో ముజఫర్ కూడా ఒకడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ కేసులో డా. ఉమర్ ఉన్ నబీ, ముజమ్మీల్, డా. అదీల్ అహ్మద్ రాథార్‌తో పాటు ముజఫర్ కూడా ప్రధాన నిందితుడని తెలిపారు. శ్రీనగర్‌లో 2022 జూన్‌లో జరిగిన ఉగ్రవాదుల సీక్రెట్ మీటింగ్‌లో ముజఫర్ పాల్గొన్నాడని, ఆ సందర్భంగానే ఏజీయూహెచ్ ఏర్పాటు చేశారని అధికారులు చెబుతున్నారు.


ఈ ఘటనలో వాడిన బాంబు తయారీ, పరీక్ష, నిల్వలో ముజఫర్ కీలక పాత్ర పోషించాడని తెలిపారు. ఫరీదాబాద్‌లో డా.ఉమర్ ఉన్ నబీ, ముజమ్మీల్ ఏర్పాటు చేసుకున్న ఒక సీక్రెట్ కేంద్రంలో ఈ బాంబు తయారీ జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికే అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ఎన్ఐఏ అధికారుల తెలిపారు.

మరో నిందితుడైన జమీర్ అహ్మద్ అహంగర్ ఏజీయూహెచ్‌కు సహాయకుడిగా పనిచేశాడు. మందుగుండు సామగ్రి, నగదు రవాణాలో కొరియర్‌గా వ్యవహరించాడు. గతంలో లష్కర్ ఉగ్ర సంస్థకు అనుబంధంగా పనిచేసిన తుఫెయిల్ అహ్మద్ పేలుడు పదార్థాలు, ఆయుధాలను సరఫరా చేశాడని ఎన్ఐఏ తన చార్జ్ షీటులో పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీ సీషెల్స్‌ పర్యటన.. విక్టోరియాలో ఘన స్వాగతం..

కేతన్ మర్డర్ కేసు.. వెలుగులోకి క్రికెట్ కోణం..

Updated Date - Jun 27 , 2026 | 08:17 PM