ఢిల్లీ పేలుళ్ల కేసు.. ఏఐ సాయంతో పేలుడు పదార్థాల తయారీ
ABN , Publish Date - May 24 , 2026 | 03:32 PM
ఎర్ర కోట పేలుళ్ల ఘటనలో ఏఐ చాట్‌బాట్, యూట్యూబ్ వీడియోల సాయంతో నిందితుడు జసీర్ పేలుడు పదార్థాలను రూపొందించినట్టు చార్జ్‌షీట్‌లో ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జసీర్ బిలాల్ వనీ పేలుడు పదార్థాల తయారీలో కీలకంగా వ్యవహరించాడని తేలింది. అతడు యూట్యూబ్ వీడియోలు, ఏఐ చాట్‌బాట్స్ సాయంతో మార్కెట్‌లో లభించే సాధారణ వస్తువలతో పేలుడు పదార్థాలను రూపొందించినట్టు అధికారులు గుర్తించారు. భారత్‌ను టార్గెట్ చేసిన అల్‌ఖైదా శాఖకు అనుబంధంగా ఉన్న అల్ ఘజ్వా ఉల్ హింద్ ఉగ్రగ్రూపులో పేలుడు పదార్థాల తయారీకి జసీర్ కీలకంగా మారినట్టు అధికారులు తమ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఎర్రకోట ఘటనలో ఉగ్రవాదులకు పేలుడు పదార్థాల తయారీలో సహకరించింది జసీర్ అని తేల్చారు.
మార్కెట్‌లో లభించే కమర్షియల్ వస్తువులతో అతడు భవిష్యత్తు దాడులకు అనువుగా డ్రోన్స్‌కు మార్పులు, ట్రిగరింగ్ వ్యవస్థలను తయారు చేశాడని చెప్పారు. యూట్యూబ్ వీడియోలు, చాట్‌జీపీటీ సాయంతో అతడు పేలుడు పదార్థాల రూపకల్పనపై రకరకాల ప్రయోగాలు చేసినట్టు కూడా గుర్తించారు. ఎర్రకోట పేలుడు కేసు నిందితులతో కలిసి అతడు కశ్మీర్ అడవుల్లో తన డిజైన్స్‌ను పరీక్షించినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి అధారాలను కూడా సేకరించారు. ఆన్‌లైన్ ట్యూటోరియల్స్, ఏఐ ఆధారంగా అతడు ఈ నైపుణ్యాలను సాధించాడని చెప్పారు. జనరేటివ్ ఏఐ, ఇతర ఓపెన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఉగ్రవాదుల చేతుల్లో దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఎంతగా ఉందో ఈ కేసు రుజువు చేస్తోందని కూడా అధికారులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా తక్కువ ధరలకు అందుబాటులో ఉండే వస్తువులతోనే నిందితులు ఇంతటి ప్రమాదకర పేలుడు పాదార్థాలను రూపొందించారని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌ను తగులబెట్టేందుకు ఇండియా కూటమి కుట్ర.. పీయూష్ గోయల్
అభిజీత్ దీప్కే, కిరణ్ రిజిజు మధ్య సోషల్ మీడియా వార్..