వెట్టిచాకిరీ వ్యవహారంపై ఎన్‌హెచ్చార్సీ సీరియస్
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:39 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలో వెలుగుచూసిన అమానుష వెట్టిచాకిరీ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలో వెలుగుచూసిన అమానుష వెట్టిచాకిరీ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), డీజీపీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు గురువారం నోటీసులు జారీ చేసింది. బాధితుల పరిరక్షణకు చేపట్టిన చర్యలు, కేసు పురోగతిపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ (యూపీ) నుంచి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లికి వచ్చిన ఒకే కుటుంబంలోని 12 మందిని ఓ నిర్మాణ స్థలంలో ఏడాదిపాటు అక్రమంగా నిర్బంధించిన ఘటన ఇటీవలే వెలుగు చూడడం గమనార్హం. వారంలో ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకుండా, రేయింబవళ్లు పనిచేయిస్తూ వీరిని వేధింపులకు గురిచేశారు. సామాజిక కార్యకర్తల ఫిర్యాదుతో రెవెన్యూ, కార్మిక శాఖ అధికారులు రంగంలోకి దిగి వారిని రక్షించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించడమే కాదు, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వెట్టిచాకిరీ చేయించుకున్న యజమాని, సూపర్‌వైజర్‌తోపాటు బాధ్యులందరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్ వివరాలు, దర్యాప్తు పురోగతిని తెలియజేయాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ వెట్టిచాకిరీ పునరావాస పథకం కింద.. ఒక్కో బాధితుడికి తక్షణ ఆర్థిక సాయంగా రూ.30 వేల చొప్పున పంపిణీ చేయాలని, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళపై సామూహిక అత్యాచారం.. ప్రియుడి భార్య సూచనలతోనే.
lప్రయాణికులను కాపాడేది వాళ్లే.. ఎమర్జెన్సీలో జరిగేదేంటో ముందే చెప్పిన హీరో పైలట్