పడిపోతున్న ఉత్తరాది రాష్ట్రాల సంతానోత్పత్తి రేటు
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:57 AM
దేశంలో జనాభా నియంత్రణ, సమతుల్యత దిశగా సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు అత్యధిక జనాభా వృద్ధిరేటుతో దేశానికి...
దక్షిణాదిలో స్వల్ప పెరుగుదల.. ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6’ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 6: దేశంలో జనాభా నియంత్రణ, సమతుల్యత దిశగా సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు అత్యధిక జనాభా వృద్ధిరేటుతో దేశానికి పెద్ద సవాలుగా నిలిచిన ఉత్తరప్రదేశ్, బిహార్, ఈశాన్య రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేట్లు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6’ నివేదిక ప్రకారం.. ఈ రాష్ట్రాలు ఇప్పుడు జాతీయ సగటుకు అత్యంత సమీపంలోకి వచ్చాయి. బాలికల విద్య పెరగడం, బాల్య వివాహాలు తగ్గడంతో పాటు ప్రభుత్వాలు విస్తృతంగా అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. తాజా నివేదికలోని రాష్ట్రాల వారీ వివరాలను పరిశీలిస్తే.. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు గతంలో 2.4గా ఉండగా, అది ఇప్పుడు 2.2కు పడిపోయింది. దేశంలోనే ఎల్లప్పుడూ అత్యధిక సంతానోత్పత్తి రేటు నమోదు చేసే బిహార్‌లో సైతం మార్పు కనిపించింది. అక్కడ గత సర్వేలో 3.0గా ఉన్న రేటు ఇప్పుడు 2.7కు తగ్గింది. ఇక దేశంలోనే అత్యంత వేగంగా సంతానోత్పత్తి రేటు తగ్గిన ప్రాంతంగా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ రికార్డు సృష్టించింది. ఇక్కడ గతంలో 2.7గా ఉన్న రేటు ఏకంగా 2.2కు పడిపోయింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మిజోరాం వంటి ఇతర ఈశాన్య రాష్ట్రాలలో కూడా జననాల రేటు సగటున 0.3 చొప్పున క్షీణించింది. ఇదే సమయంలో దేశంలోనే అత్యంత తక్కువ సంతానోత్పత్తి రేటు కలిగిన రాష్ట్రంగా సిక్కిం 1.0తో నిలిచింది. మరోవైపు, గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి రేట్లు క్రమంగా తగ్గుతూ వచ్చిన దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం స్వల్ప పెరుగదల కనిపిస్తోంది. తెలంగాణలో గతంలో 1.8గా ఉన్న రేటు, తాజా సర్వేలో అది 1.9కి పెరిగింది. ఏపీ, కర్ణాటకల్లో ఈ రేటు 1.7 నుంచి 1.8కి చేరింది. కేరళలో కూడా 1.8కి పెరిగింది. ప్రస్తుతం దేశ జాతీయ సగటు 2.0గా ఉంది.