వీబీ-జీరామ్‌జీ చట్టం అమలుకు ముసాయిదా రూల్స్ విడుదల
ABN , Publish Date - May 24 , 2026 | 04:01 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్...
అభ్యంతరాలుంటే జూన్ 21లోగా చెప్పాలన్న కేంద్రం
జూలై 1 నుంచి అమల్లోకి చట్టం
న్యూఢిల్లీ, మే 23: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్-గ్రామీణ(వీబీ-జీరామ్‌జీ) చట్టం-2025 ముసాయిదా నిబంధనలను కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసింది. చట్టం అమలు ఎలా, పనుల పర్యవేక్షణ బాధ్యత ఎవరిది, పథకానికి ఎవరు అర్హులు, పనిదినాలెన్ని, వేతనాల చెల్లింపులు ఎలా, రాష్ట్ర ప్రభుత్వాల విధులేంటి.. అన్న అంశాలను అందులో పేర్కొంది. లబ్ధిదారులు ఉపాధి హామీ చట్టం నుంచి వీబీ-జీరామ్‌జీ చట్టానికి మారే ప్రక్రియను వివరించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలుంటే జూన్ 21లోగా తెలియజేయాలని రాష్ట్రాలను, నిపుణులను, సంస్థలను, ప్రజాసంఘాలను కోరింది. ముసాయిదాలో పేర్కొన్న దాని ప్రకారం.. వీబీ-జీరామ్‌జీ చట్టం అమలుకు కేంద్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్ నుంచి ప్రతినిధులు, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఇక, కేంద్రస్థాయిలోనే సెంట్రల్ గ్రామీణ్ రోజ్‌గార్ గ్యారంటీ కౌన్సిల్ పనులను పర్యవేక్షిస్తుంది. చట్టం అమలును మదిస్తుంది. ఈ చట్టంలో ఒక కూలీకి ఏడాదిలో కల్పించాల్సిన పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచారు. కూలీలు కోరిన 15రోజుల్లోగా పని ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే, వారికి భృతిని చెల్లించాలి. పని కల్పించడం ఆలస్యమైన మొదటి 30రోజుల్లో.. రోజువారీగా కనీసం పావు వంతు వేతనం చెల్లించాలి. తర్వాత కూడా పని కల్పించకపోతే సగం వేతనాన్ని చెల్లించాలని ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేవైసీ చేసుకున్నవారందరినీ కొత్త చట్టం కింద గుర్తిస్తారు. వీబీ-జీరామ్‌జీ కార్డులు వచ్చే వరకు ఉపాధి హామీ జాబ్‌కార్డులు చెల్లుబాటు అవుతాయి.