కొత్త సీడీఎస్‌గా జనరల్ సుబ్రమణి బాధ్యతలు
ABN , Publish Date - Jun 01 , 2026 | 03:58 AM
రక్షణ సిబ్బంది చీఫ్ (సీడీఎస్)గా జనరల్ ఎన్‌ఎస్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అలాగే నౌకాదళం కొత్త అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ...
నూతన నౌకాదళాధిపతిగా అడ్మిరల్ స్వామినాథన్ కూడా
న్యూఢిల్లీ, మే 31: రక్షణ సిబ్బంది చీఫ్ (సీడీఎస్)గా జనరల్ ఎన్‌ఎస్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అలాగే నౌకాదళం కొత్త అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించారు. శనివారం పదవీవిరమణ చేసిన జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో.. పాకిస్థాన్, చైనా అంశాల్లో నిపుణుడిగా పేరుగాంచిన జనరల్ సుబ్రమణి నియమితులైన సంగతి తెలిసిందే. సైనికసిబ్బంది వైస్‌చీఫ్‌గా గత ఏడాది జూలై 31న రిటైరైన ఆయన.. ఇప్పటివరకు ఆయన జాతీయ భద్రతా మండలి సచివాలయంలో మిలిటరీ సలహాదారుగా ఉన్నారు. సైన్యం, వాయుసేన, నౌకాదళాలను ఏకీకృత కమాండ్ కిందకు తీసుకురావడం.. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయ సాధన కొత్త సీడీఎస్‌గా ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. ఇంకోవైపు.. పదవీవిరమణ చేసిన అడ్మిరల్ దినేశ్‌కుమార్ త్రిపాఠి స్థానంలో నూతన నౌకావళం చీఫ్‌గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టడానికి ముందు ఆయన పశ్చిమ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా విధులు నిర్వర్తించేవారు.