Share News

నీట్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:12 AM

నీట్‌-యూజీ రీ ఎగ్జామ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్‌-అండ్‌-పేపర్‌ విధానంలో జరిగే ఈ పరీక్షకు ...

నీట్‌కు సర్వం సిద్ధం

  • రేపే పునఃపరీక్ష.. 22.79 లక్షల మంది దరఖాస్తు

న్యూఢిల్లీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): నీట్‌-యూజీ రీ ఎగ్జామ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్‌-అండ్‌-పేపర్‌ విధానంలో జరిగే ఈ పరీక్షకు ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమయం కేటాయించడంతో వారు సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మన దేశంలో 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు పేర్లను నమోదు చేసుకున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్‌టీఏ భారీ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. పర్యవేక్షణ కోసం 674 మంది సిటీ కోఆర్డినేటర్లు, స్వతంత్ర నిఘా కోసం 6,669 మంది అబ్జర్వర్లను నియమించింది. మొత్తంగా 2 లక్షల మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ప్రశ్నపత్రాలను జీపీఎస్‌ అమర్చిన వాహనాలతో, పోలీసు బందోబస్తు మధ్య తరలించనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, కేంద్ర కంట్రోల్‌రూమ్‌ ద్వారా నేరుగా పర్యవేక్షిస్తారు. బయోమెట్రితో పాటు అత్యాధునిక మెటల్‌ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. బయోమెట్రిక్‌ తనిఖీల సమయంలో వేలిముద్రలు పడకపోయినా, ఇతరేతర సాంకేతిక సమస్యలు తలెత్తినా.. పరీక్ష కేంద్రంలో అందుబాటులో ఉండే నిర్దేశిత ఫార్మాట్‌లో అభ్యర్థి సంతకంతో కూడిన లెటర్‌ తీసుకుని, మాన్యువల్‌గా ఐడీ వెరిఫికేషన్‌ చేసి పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తామని ఎన్‌టీఏ తెలిపింది. ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు పారదర్శకమైన బాటిల్‌లో నీళ్లను తమతోపాటు లోపలికి తీసుకెళ్లవచ్చు. డయాబెటిస్‌తో బాధపడే విద్యార్థులు షుగర్‌ ట్యాబ్లెట్లు, అరటి పండ్లు, యాపిల్‌, నారింజలను వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.


నిర్దేశిత సమయంలోపే చేరుకోవాలి

విద్యార్థులు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్ష కేంద్రం గేటు మూసివేస్తారు. సంప్రదాయ, మతపరమైన దుస్తులు, పూర్తి చేతుల దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసం ముందే కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు తమతో పాటు అడ్మిట్‌ కార్డు ప్రింట్‌, ఒక ఒరిజినల్‌ ఫొటో ఐడీ కార్డు, అటెండెన్స్‌ షీట్‌ కోసం రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలను తప్పనిసరిగా తెచ్చుకోవాలి. విద్యార్థుల కోసం ఎన్‌టీఏ 91 78279 80287 నంబరుతో ఒక అధికారిక వాట్సప్‌ నెంబరును ప్రకటించింది. ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూ టిక్‌ ఉంటుంది. విద్యార్థుల పరీక్ష కేంద్రాల వివరాలు, అప్‌డేట్‌లు ఈ నంబరు నుండే పంపుతామని తెలిపింది. బ్లూటిక్‌ లేకుండా తమ పేరుతో ఏమైనా మెసేజీలు వాట్సప్‌కు వస్తే వాటిని నమ్మవద్దని సూచించింది. అధికారిక ఎస్‌ఎంఎస్‌లు ఎన్‌ఐసీపీఈపీ అనే ఐడీ నుంచి, ఈ మెయిళ్లు నో-రిప్లై.నీట్‌.ఎన్‌టీఏఎట్‌ఎన్‌ఐసీ.ఇన్‌ నుంచి వస్తాయని పేర్కొంది. కాగా, తెలంగాణలో మొత్తం 199 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 73,024 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు నమోదు చేసుకున్నారు. గత నెలలో జరిగిన నీట్‌ పరీక్షకు 71,304 మంది హాజరయ్యారు.

Updated Date - Jun 20 , 2026 | 05:35 AM