వదంతులు నమ్మకండి
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:33 AM
నీట్-యూజీ రీఎగ్జామ్ తాము ముందుగా ప్రకటించినట్టుగానే ఈ నెల 21వ తేదీన జరుగుతుందని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) స్పష్టం చేసింది.
మూడు రోజుల్లో పరీక్ష ఉంది.. బాగా రాయండి
నీట్ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పిలుపు
న్యూఢిల్లీ, జూన్ 18: నీట్-యూజీ రీఎగ్జామ్ తాము ముందుగా ప్రకటించినట్టుగానే ఈ నెల 21వ తేదీన జరుగుతుందని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. నీట్ రీఎగ్జామ్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని అభ్యర్థులను కోరింది. విద్యార్థులంతా పరీక్ష బాగా రాయడంపైనే దృష్టి సారించాలని సూచిస్తూ ఎన్‌టీఏ ఎక్స్‌లో గురువారం ఓ పోస్టు చేసింది. విద్యార్థులు ఎవరైనా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే మానస్ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ 14416కు ఫోన్ చేసి సాయం పొందాలని పేర్కొంది. మరోవైపు.. నీట్-యూజీ రీఎగ్జామ్ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీట్ రీఎగ్జామ్ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులంతా కృషి చేయాలని కోరారు. కాగా, నీట్ యూజీ-2026 రీఎగ్జామ్‌కు హాజరు కావాల్సిన అహ్మదాబాద్‌కు చెందిన ఓ బాలుడు(17) గురువారం తెల్లవారు జామున 2.55 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తులో బాల్కని నుంచి దూకి బలవన్మరణం పొందాడు.