Share News

నీట్‌ దరఖాస్తులు ప్రారంభం

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:27 AM

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) యూజీ-2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. పరీక్ష షెడ్యూల్‌ వివరాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ....

నీట్‌ దరఖాస్తులు ప్రారంభం

  • తుది గడువు మార్చి 8..మే 3న నీట్‌ యూజీ-2026 పరీక్ష

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) యూజీ-2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. పరీక్ష షెడ్యూల్‌ వివరాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం వెల్లడించింది. నీట్‌ యూజీ-2026 పరీక్షను ఈ ఏడాది మే 3న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 8(ఆదివారం) నుంచే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, చివరి తేదీ మార్చి 8 అని, ఆ రోజు రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా, నీట్‌ దరఖాస్తు విధానంలో ఈ ఏడాది కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించే సమయంలో లైవ్‌ ఫొటో తీసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. ఆన్‌లైన్‌లో అభ్యర్థి కాప్చర్‌ చేసిన లైవ్‌ఫోటోను ఆటోమేటిక్‌గా ఆధార్‌తో సరిపోల్చుతుంది. ఒకవేళ లైవ్‌ఫొటో ఆధార్‌తో సరిపోలలేదంటే వెంటనే అభ్యర్థి గుర్తింపునకు సంబంధించిన ఇతర ధ్రువీకరణ పత్రాలను అదనంగా అప్‌లోడ్‌ చేయాల్సివుంటుంది. దీంతోపాటు అభ్యర్థి గుర్తింపు వెరిఫికేషన్‌ కోసం ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీని ప్రవేశపెట్టారు. ఇక పరీక్ష కేంద్రం కోసం అభ్యర్థులు ప్రాధాన్య క్రమాన్ని సూచించాల్సిన అవసరం ఈసారి లేదు. అభ్యర్థులు వారి దరఖాస్తులో పేర్కొన్న ప్రస్తుత, శాశ్వత చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రాన్ని ఆటోమేటిక్‌గా సిస్టమే కేటాయిస్తుంది.

Updated Date - Feb 09 , 2026 | 01:27 AM