నీట్ రీ టెస్ట్‌లో ‘శంకర్‌దాదా’లు..పలువురి అరెస్టు
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:07 AM
శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా గుర్తుందా..? ఆ సినిమాలో శంకర్‌దాదా స్థానంలో ఓ డాక్టర్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాస్తారు. శంకర్ దాదా పాస్ అయిపోతాడు.
న్యూఢిల్లీ, జూన్ 22: శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా గుర్తుందా..? ఆ సినిమాలో శంకర్‌దాదా స్థానంలో ఓ డాక్టర్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాస్తారు. శంకర్ దాదా పాస్ అయిపోతాడు. అచ్చంగా అలాంటి ఘటనే బిహార్‌లో పునరావృతమైంది. నీట్ రీ టెస్ట్‌లో అవకతవకలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించిన బిహార్ పోలీసులు 24మందిని అరెస్టు చేశారు. వీరిలో వైద్య విద్యార్థులు, బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. వైద్య విద్యార్థి అర్పిత్ రాజ్ ఈ మోసానికి కీలక సూత్రధారుల్లో ఒకడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతన్ని 2024 నీట్-పీజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది. తాజా కేసులో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థి మయాంక్ కశ్య్‌పను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు పరీక్ష ప్రక్రియలో పాల్గొంటున్న ఓ బయోమెట్రిక్ కంపెనీకి చెందిన 14మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. కాగా, నీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోపై ఎన్‌టీఏ స్పందిస్తూ అది అబద్ధమని తెలిపింది.