Share News

యూపీఎస్సీని చూసి నేర్చుకోండి

ABN , Publish Date - May 30 , 2026 | 03:28 AM

నీట్‌ -యూజీ పరీక్ష పేపర్‌ లీక్‌పై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తీరును సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. పరీక్షల నిర్వహణలో ...

యూపీఎస్సీని చూసి నేర్చుకోండి

  • సివిల్స్‌ పేపర్లు లీక్‌ కాకుండా పరీక్షలు నిర్వహిస్తోంది: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, మే29 (ఆంధ్రజ్యోతి): నీట్‌ -యూజీ పరీక్ష పేపర్‌ లీక్‌పై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తీరును సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపడితే సరిపోదని, జవాబుదారీతనం కూడా ఉండాలని వ్యాఖ్యానించింది. ఏళ్లతరబడి పరీక్షల కోసం సిద్ధమైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేపర్‌ లీక్‌తో తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారని.. వారికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించించింది. పేపర్‌ లీక్‌పై దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ విచారణకు ఎన్‌టీఏ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హారజయ్యారు. నీట్‌ పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం గతంలో నియమించిన హైలెవల్‌ కమిటీ చైర్మన్‌, ఇస్రో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ రాధాకృష్ణన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఎలాంటి పొరపాట్లు లేకుండా దశాబ్దాలుగా నిర్వహిస్తోందని.. ఆ సంస్థ నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఎన్‌టీఏకు సూచించింది. నీట్‌ పరీక్షల నిర్వహణకు అత్యుత్తమైన పర్యవేక్షణ వ్యవస్థను, కమిటీని నియమించామని చెబుతున్నారని.. మరి ఇన్ని ఉన్నా పేపర్‌ ఎలా లీకైందని జస్టిస్‌ నరసింహ ప్రశ్నించారు.

కమిటీ ఏం సూచించింది?

నీట్‌ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు హైలెవల్‌ కమిటీ ఎలాంటి సూచనలు చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. వాటిలో ఇప్పటివరకు ఎన్ని అమలుచేశారో చెప్పాలని కోరింది. అందుకు రాధాకృష్ణన్‌ స్పందిస్తూ.. తాము స్వల్ప, దీర్ఘకాలిక అంశాలను కలిపి మొత్తం 101 సూచనలు చేశామని చెప్పారు. వీటిలో ఇప్పటికే చాలావరకు అమలుచేశారని, మరికొన్ని సూచనలు అమలుచేసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో కొన్ని నెలలుగా ఎన్‌టీఏ బలోపేతమైందని వివరించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ నరసింహ.. మరి ఇన్ని చర్యలు తీసుకున్నా పేపర్‌ ఎలా లీకైందని ప్రశ్నించారు. దీంతో ప్రశ్నపత్రం తయారీ దశలోనే లీకైందని రాధాకృష్ణన్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రశ్నపత్రం తయారీ విధానాన్ని కూడా బలోపేతం చేసినట్లు చెప్పారు. జూన్‌ 21న జరిగే పరీక్షలో పొరపాట్లు పునరావృతం కాకుండా చూడటమే ప్రస్తుతం తమ కర్తవ్యమని పేర్కొన్నారు. ధర్మాసనం స్పంది స్తూ సంస్కరణలు చేపట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని.. అందరిలోనూ జవాబుదారీత నం వచ్చినప్పుడే పరిష్కారం లభిస్తుందని పేర్కొం ది. అంతవరకు ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించింది.


ప్రధాని పర్యవేక్షణలో పరీక్ష

జూన్‌ 21న నిర్వహించనున్న నీట్‌-యూజీ పరీక్ష కోసం తీసుకున్న చర్యలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి వివరించారు. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పేపర్‌ లీక్‌పై దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ఐఐటీ నిపుణులను కూడా పర్యవేక్షణ కమిటీలో చేరుస్తున్నామని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. నీట్‌ పేపర్‌ లీక్‌పై జూలై రెండోవారంలోగా సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించింది.

ఏకరూప ట్రామా కేర్‌ విధానంపై రాష్ట్రాలకు మూడు నెలల గడువు

ప్రమాదాల్లో గాయపడ్డ వారికి తక్షణం సహాయం అందించేందుకు ఉద్దేశించిన ట్రామా కేర్‌ విషయమై మూడు నెలల్లోగా ఏకరూప విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. బాధితులు సహాయం కోసం అభ్యర్థించేందుకు కామన్‌ హెల్ప్‌లైన్‌ నెంబరు ఉండాలని సూచించింది. ప్రమాదం గురించి సమాచారం అందించే వారికి గుడ్‌ సమార్టియన్‌ విధానం కింద తగిన రక్షణ ఉంటుందని, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపింది.

Updated Date - May 30 , 2026 | 03:28 AM