‘ఫిఫా’ గ్రూపులో ‘నీట్’ ప్రశ్నలు!
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:32 AM
నీట్ పేపర్ లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు.. ఎవరికీ అనుమానం రాకుండా ఫిఫా ప్రపంచకప్-2026 పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ సృష్టించినట్టు సీబీఐ పేర్కొంది.
ఫిఫా ప్రపంచకప్-2026 పేరుతో వాట్సాప్ గ్రూప్!
నీట్ పేపర్ లీకు వీరుల సృష్టి
కెమిస్ట్రీలో 135, ఫిజిక్స్‌లో 68 వాస్తవ ప్రశ్నలతో సరిపోలాయి
రూ.10-12 లక్షలకు బేరసారాలు
20 వేల పేజీల చార్జిషీట్‌లో సీబీఐ
న్యూఢిల్లీ, ఆగస్టు 7: నీట్ పేపర్ లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు.. ఎవరికీ అనుమానం రాకుండా ఫిఫా ప్రపంచకప్-2026 పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ సృష్టించినట్టు సీబీఐ పేర్కొంది. గత ఏడాది నవంబరులో సృష్టించిన ఈ గ్రూపులో 8మంది సభ్యులు ఉన్నట్టు పేర్కొంది. నిందితులు పీవీ కులకర్ణి, మనీషా మంధారేలను విచారించగా ఈ విషయాలు వెలుగు చూసినట్టు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు సమర్పించిన 20 వేల పేజీల చార్జిషీట్‌లో సీబీఐ ఆయా వివరాలను వెల్లడించింది. ‘‘పుణేకు చెందిన మంధారే వాట్సాప్ గ్రూపును సృష్టించారు. ఈ గ్రూపునకు సమన్వయకర్తగా పుణేకు చెందిన బ్యూటీషియన్ మనీషా వాఘ్మరే వ్యవహరించారు. నిపుణులైన అధ్యాపకులతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బయాలజీ, కెమిస్ట్రీ, బోటనీ క్లాసులను నిర్వహించారు.’’ అని సీబీఐ వివరించింది. మరో నిందితుడు, ఫిజిక్స్ నిపుణుడు మనీష్‌ను వాఘ్మరే ఈ గ్రూప్‌లోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. మొత్తం 66 రాతపూర్వక ప్రశ్నలను విద్యార్థులకు లీక్ చేసినట్టు వివరించింది. లీకైన ప్రశ్నలను సబ్జక్టుల వారీగా విభజించేందుకు పుణేలోని వాఘ్మరే భర్త డెంటల్ క్లినిక్‌ను వేదికగా మలుచుకున్నారని సీబీఐ తెలిపింది.
కులకర్ణి ఇంట్లో ప్రత్యేక తరగతులు
ఎన్‌టీఏ కెమిస్ట్రీ నిపుణుడు పీవీ కులకర్ణి అడ్డంగా దొరికినట్టు సీబీఐ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. పుణేలోని ఆయన నివాసంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారని తెలిపింది. మే3న నీట్ పరీక్ష జరగడానికి ముందు విద్యార్థులు కులకర్ణి నివాసానికి వచ్చారని పేర్కొంది. మొత్తంగా సీబీఐ తన చార్జిషీట్‌లో పుణేకు చెందిన ముగ్గురు నిపుణులను నిందితులుగా పేర్కొంది. కెమిస్ట్రీ నిపుణుడు కులకర్ణి, జంతు, వృక్షశాస్త్ర నిపుణుడు మనీషా గురునాథ్ మంధారే, ఫిజిక్స్ నిపుణుడు మనీషా సంజయ్ హవాల్దార్‌లు..ఎన్‌టీఏకు చెందిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని ప్రశ్నలను డబ్బుకు ఆశపడి బయట పెట్టారని తెలిపింది. లీకైన ప్రశ్నల్లో దాదాపు 85శాతం వాస్తవ ప్రశ్నలతో పోలి ఉన్నాయని సీబీఐ పేర్కొంది. ఈ ప్రశ్నలు నాలుగు సెట్ల(కైలాశ్, శివాలిక్, సెట్ 2, సెట్ 3) నుంచే ఉన్నాయని నిర్ధారించినట్టు చార్జిషీట్‌లో వెల్లడించింది. ఇదిలావుంటే, ఓఖ్లాలోని ఎన్‌టీఏ భవనంలో ప్రశ్న పత్రాల అనువాదం జరిగిందని, ఈ భవనంలో ఉన్న లోపాలను కులకర్ణి, మంధారే,హవాల్దర్‌లు తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు సీబీఐ పేర్కొంది. కార్యాలయంలో సీసీటీవీలు లేకపోవడం, మానిటర్ చేసేవారు కొరవడడంతోనే నిందితులు ప్రశ్నలను లీక్ చేయగలిగారని వివరించింది. తాము బసచేసిన హోటళ్లకు వెళ్లిపోయిన తర్వాత.. ప్రశ్నపత్రాలను తిరిగి రాసుకున్నారని తెలిపింది. కులకర్ణి.. చిత్తుకాయితాలపై రాసుకున్న 135 కెమిస్ట్రీ ప్రశ్నలను చిన్న చిన్న చిట్టీలుగా తీసుకువెళ్లారని పేర్కొంది. అలాగే చిన్నపాటి ప్రశ్నలను గుర్తుంచుకుని ఎప్పటికప్పుడు తిరిగి రాశారని తెలిపింది. ఎక్కువగా రసాయశాస్త్ర ప్రశ్నలు మ్యాచ్ అయినట్టు పేర్కొంది. అలాగే హవాల్దార్, వాఘ్మరేలు తమ జ్ఞాపక శక్తిని వినియోగించి ప్రశ్నలను టిక్ చేసుకున్నారని పేర్కొంది. కులకర్ణి నుంచి మధ్యవర్తి ద్వారా ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్‌కు ప్రశ్నలు చేరాయని తెలిపింది.
తల్లిదండ్రులతో బేరసారాలు
నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో మంగీలాల్, వికాస్ బివాల్, రిషి బివాల్.. విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు నిర్వహించినట్టు సీబీఐ పేర్కొంది. ఏప్రిల్ 26న వారు చేసిన బేరసారాల ఆడియోలను పరిశీలించినట్టు తెలిపింది. యశ్ యాదవ్ అనే నిందితుడు నీట్ పరీక్షకు నాలుగు రోజుల ముందు ప్రశ్నలను పీడీఎఫ్ లేదా హార్డ్ కాపీలలో పంపించేందుకు రూ.10-12 లక్షలకు బేరం కుదుర్చుకున్నారని, దీనికి సంబంధించిన ఆడియో ఉందని పేర్కొంది. చేతిరాతతో ఉన్న ప్రశ్నలను ఫోరెన్సిక్ నిపుణులకు పంపి నిర్ధారించుకున్నట్టు తెలిపింది. మనీష్ హవాల్దార్, తేజస్ షాల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్‌లలో 68 ఫిజిక్స్ ప్రశ్నలను గుర్తించినట్టు పేర్కొంది.