Share News

నీట్‌ పేపర్‌ లీక్‌ వెనక బ్యూటీషియన్‌ హస్తం

ABN , Publish Date - May 19 , 2026 | 04:11 AM

నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనలో సీబీఐ పురోగతి సాధించింది. ఈ కుట్ర వెనక పుణేకు చెందిన 46ఏళ్ల బ్యూటీషియన్‌ ‘కామన్‌ లింక్‌’గా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నీట్‌ పేపర్‌ లీక్‌ వెనక బ్యూటీషియన్‌ హస్తం

  • ప్యానెల్‌ సభ్యురాలితో కలిసి కుట్ర

  • పరీక్షకు 10 రోజుల ముందే లీక్‌

న్యూఢిల్లీ, మే 18: నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనలో సీబీఐ పురోగతి సాధించింది. ఈ కుట్ర వెనక పుణేకు చెందిన 46ఏళ్ల బ్యూటీషియన్‌ ‘కామన్‌ లింక్‌’గా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ట్యూషన్‌ కోసం వచ్చే విద్యార్థులను, కార్పొరేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులను కలుపుతూ నెట్‌వర్క్‌ నడిపే మనీషా వాఘ్మారే అనే బ్యూటీషియన్‌.. అదే పరిచయాలతో నీట్‌ పేపర్‌ను అమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మనీషాను ఇప్పటికే అరెస్ట్‌ చేసిన సీబీఐ..ఆమె ఇచ్చిన సమాచారంతోనే కేసులో అసలు సూత్రధారుల్లో ఒకరైన ప్యానెల్‌ సభ్యురాలు మనీషా గురునాథ్‌ మందరేతో పాటు కెమిస్ట్రీ లెక్చరర్‌ పీవీ కులకర్ణిలను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వీరు దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నారు. ఈ ముఠా ఒక్కో విద్యార్థి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల వరకు డీల్‌ కుదుర్చుకుని, తలా రూ.3లక్షలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. పేపర్‌ కొనేందుకు సరైన విద్యార్థులను గుర్తించిన వాఘ్మారే.. ఈ పథకాన్ని నాసిక్‌లో కౌన్సెలింగ్‌ బిజినెస్‌ నడిపే శుభమ్‌తో పంచుకుందని సీబీఐ వెల్లడించింది. బ్యూటీషియన్‌ వాఘ్మారే నడిపిన నెట్‌వర్క్‌ ఆధారంగా మహారాష్ట్రలోని లాతూర్‌లో ఓ ప్రముఖ కోచింగ్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు శివరాజ్‌ను సీబీఐ ఆదివారం అరెస్ట్‌ చేసింది. అతని నివాసంలో జరిపిన సోదాల్లో లీకైన ప్రశ్నపత్రం కనిపించినట్లు తెలుస్తోంది. పరీక్షకు 10రోజుల ముందే సూత్రధారుల నుంచి ప్రశ్నలు, జవాబుల సెట్‌ను సంపాదించినట్లు సమాచారం. ఆ తర్వాత ‘ఎంపిక’ చేసుకున్న విద్యార్థులకు వారి నోట్‌బుక్‌లో చేతిరాతతో ఈ ప్రశ్నలు రాయించారు. పరీక్ష ముగిసిన తర్వాత వాటిని తగలబెట్టినట్లు సీబీఐ గుర్తించింది.

Updated Date - May 19 , 2026 | 04:12 AM