Share News

‘నీట్‌’కు వయో పరిమితి?

ABN , Publish Date - May 23 , 2026 | 04:19 AM

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- 2026 ప్రశ్నపత్రం లీకైన నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.

‘నీట్‌’కు వయో పరిమితి?

  • పరీక్ష రాసేందుకు కూడా కట్టడి

  • ఇకపై ‘ఎన్నిసార్లయినా’ కుదరదు

  • పేపర్‌ లీక్‌ కుంభకోణంతో చర్యలు

  • కఠిన నిర్ణయాలు తప్పవు: ధర్మేంద్ర

  • పేపర్‌ లీక్‌ కాలేదు.. గెస్‌ పేపర్‌లోని ప్రశ్నలే పరీక్షలో వచ్చాయి: ఎన్‌టీఏ

  • మాఫియాతో సర్కార్‌ కుమ్మక్కు: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, మే 22: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- 2026 ప్రశ్నపత్రం లీకైన నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. నీట్‌ రాసే అభ్యర్థులకు వయోపరిమితి విధించడంతోపాటు ఎన్ని సార్లయినా రాసేందుకు ఇకపై అనుమతించకపోవచ్చని సమాచారం. ఈ విషయంపై సిఫారసు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలిపింది. అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు పరిమితి విధించనున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌.. గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ నేతృత్వంలో స్థాయీ సంఘం ముందు హాజరయ్యారు. నీట్‌-యూజీ పేపర్‌ లీకైన నేపథ్యంలో భవిష్యత్తులో ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి తీసుకురానున్న సంస్కరణలను వివరించారు. ప్రధానంగా మూడు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించినట్టు సింగ్‌ వివరించారు. అయితే, ఇటీవల జరిగింది.. ‘పేపర్‌ లీక్‌’ కాదని, గెస్‌ పేపర్‌లో వచ్చిన ప్రశ్నలే వాస్తవ ప్రశ్న పత్రంలో కనిపించాయని ఆయన సమర్థించుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది.

పెన్‌ పేపర్‌ బదులుగా కంప్యూటర్‌

పేపర్‌-పెన్‌ ఆధారిత పరీక్ష స్థానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. బహుళ దశల్లో పరీక్షను నిర్వహించడం. ప్రస్తుతం ఒకే దశ(షిఫ్ట్)లో పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యేవారికి వయోపరిమితి, పరీక్షలు రాసే సంఖ్యపై పరిమితి విధించడం. ప్రస్తుతం 17 ఏళ్లు నిండిన వారు పరీక్ష రాసేందుకు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి లేదు. అదేవిధంగా నీట్‌ పరీక్షను ఎన్నిసార్లయినా రాయొచ్చు.


100 శాతం తప్పులు లేకుండా..

జూన్‌ 21న నిర్వహించనున్న నీట్‌-యూజీ రీటెస్టును 100 శాతం తప్పులు లేకుండా నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ‘పరీక్షల మాఫియా’ కారణంగా ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగరాదని.. అర్హులైన అభ్యర్థులు ఒక్క సీటును కూడా కోల్పోరాదని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారంలో విచారణ అనంతరం కఠిన నిర్ణయాలు తప్పవని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన జాగరణ్‌ భారత్‌ విద్యా సదస్సులో శుక్రవారం ధర్మేంద్ర పాల్గొన్నారు. పరీక్ష పేపర్‌ లీకైన వ్యవహారం వెలుగు చూడడంతో 22 లక్షల మంది విద్యార్థులు మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. పరీక్షల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. నీట్‌ పరీక్ష లీకైన వ్యవహారంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘‘ఈ సమయంలో కళ్లుమూసుకుని కూర్చోం. సమస్య నుంచి పారిపోం. వ్యవస్థను సరైన గాడిలో పెడతాం.’’ అని వ్యాఖ్యానించారు.

నేషనల్‌ ట్రామా ఏజెన్సీ: కాంగ్రెస్‌

నీట్‌ ప్రశ్న పత్రం లీక్‌ కాలేదని, కేవలం గెస్‌ పేపర్‌లోని ప్రశ్నలే.. వాస్తవ ప్రశ్న పత్రంలో కనిపించాయంటూ.. ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ‘లీక్‌’ వ్యవహారాన్ని కప్పిపుచ్చేలా ఉన్నాయని.. దీనికి మీరు పూచీ పడతారా.. అంటూ ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాంగ్రెస్‌ నిలదీసింది. ఎన్‌టీఏ అంటే.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కాదని.. ‘నేషనల్‌ ట్రామా ఏజెన్సీ’ అనిఎద్దేవా చేసింది. పరీక్షల మాఫియాతో ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆరోపించింది.

నీట్‌ లీకేజీలో పుణె మహిళ అరెస్టు

నీట్‌ ఫిజిక్స్‌ పేపర్‌ను లీక్‌ చేశారన్న ఆరోపణలపై పుణెకు చెందిన మనీషా సంజయ్‌ హవల్దార్‌ను శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. ఇక్కడి సేఠ్‌ హీరాలాల్‌ షరాఫ్‌ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఆమెను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఫిజిక్స్‌ ప్రశ్న పత్రానికి సంబంధించి ‘పరీక్షల నిపుణురాలి’గా నియమించింది. ఆ హోదాను అవకాశంగా తీసుకొని ఇతర నిందితులతో కలిసి ఆమె ప్రశ్నలను లీక్‌ చేసినట్టు సీబీఐ ఆరోపించింది. లీకేజీ కేసులో ఇంతవరకు సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది.

Updated Date - May 23 , 2026 | 04:19 AM