నాగపూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:25 AM
నీట్ పరీక్ష రాయనున్న మహారాష్ట్రలోని నాగపూర్‌నకు చెందిన ఓ విద్యార్థికి యూఈఏలోని అబుదాబిలో పరీక్షకేంద్రాన్ని కేటాయించటం కలకలం రేపింది.
నీట్ రీ ఎగ్జామ్ ప్రక్రియలో విచిత్రం
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
సవరించి మళ్లీ హాల్ టికెట్ విడుదల చేసిన ఎన్‌టీఏ.. నేడే నీట్ రీ ఎగ్జామ్
నాగపూర్, న్యూఢిల్లీ, జూన్ 20: నీట్ పరీక్ష రాయనున్న మహారాష్ట్రలోని నాగపూర్‌నకు చెందిన ఓ విద్యార్థికి యూఈఏలోని అబుదాబిలో పరీక్షకేంద్రాన్ని కేటాయించటం కలకలం రేపింది. అబ్దుల్లా తాలిబ్ అనే విద్యార్థి పరీక్షకేంద్రం ఎంపికల్లో నాగపూర్, వార్దా, బండారా నగరాల పేర్లను తన దరఖాస్తులో పేర్కొన్నాడు. అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు.. ఈ మూడింటిలో ఏదీ కాకుండా అబుదాబిలోని ఓ పరీక్షకేంద్రాన్ని కేటాయించటం చూసి దిగ్ర్భాంతి చెందాడు. దీనిపై అబ్దుల్లా తండ్రి డాక్టర్ మహమ్మద్ తాలిబ్.. పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దృష్టికి తీసుకువెళ్లారు. సాంకేతిక తప్పిదంతో ఈ పొరపాటు జరిగిందని ఎన్‌టీఏ అధికారులు అంగీకరించారు. తర్వాత నాగపూర్‌లోనే ఒక కేంద్రాన్ని విద్యార్థికి కేటాయిస్తూ మళ్లీ హాల్ టికెట్ విడుదల చేశారు. అయితే, ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ఎన్‌టీఏ పనితీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. మన విద్యార్థుల భవిష్యత్తుతో జూదం ఆడటం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో విద్యావ్యవస్థ ధ్వంసమైపోయిందని, ఇది ఒక తరం విద్యార్థుల డబ్బులు, సమయం, మానసిక ప్రశాంతతను దోపిడీ చేయటమేనంటూ నిప్పులు చెరిగారు. మరోవైపు, నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన జతిన్ కుమార్ అనే విద్యార్థి ఇంట్లో తన గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్
ఆదివారం నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో ఎన్‌టీఏ శనివారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించింది. దేశవిదేశాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 22.79 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. గత నెలలో నిర్వహించిన నీట్ పరీక్ష.. ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై, ఎన్‌టీఏపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో ఈసారి రీఎగ్జామ్‌కు గతంలో ఎన్నడూ లేని 2లక్షల మందికిపైగా సిబ్బంది భద్రతా విధుల్లో పాలుపంచుకుంటున్నారు.