Share News

ఎన్‌డీఏ-టీవీకే పొత్తు..త్రిష చేతిలో నిర్ణయం?!

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:27 AM

తమిళనాడులో ఎన్‌డీఏ-టీవీకే పొత్తు సినీనటి త్రిష చేతుల్లో ఉందని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఎన్‌డీఏ-టీవీకే పొత్తు..త్రిష చేతిలో నిర్ణయం?!

  • గత వారం ముంబైలో అమిత్‌షాతో ఆమె భేటీ?

చెన్నై, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ఎన్‌డీఏ-టీవీకే పొత్తు సినీనటి త్రిష చేతుల్లో ఉందని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పాలక డీఎంకేదే పైచేయి అని, విపక్ష ఎన్‌డీఏపై 5 శాతం ఓట్ల ఆధిక్యంతో ఉందని.. ప్రముఖ సినీ నటుడు విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీకి 12 శాతం ఓట్లు రావచ్చని పలు సర్వేలు అంచనా వేసిన నేపథ్యంలో.. ఎన్‌డీఏ నేతలు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా విజయ్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరూర్‌ తొక్కిసలాట ఘటన వ్యవహారం విజయ్‌ను ఇప్పటికీ వెంటాడుతోంది. సీబీఐ విచారణతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆయన ‘జననాయగన్‌’ సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు నుంచి క్లియరెన్సు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు సన్నిహితురాలిగా భావిస్తున్న త్రిష గత వారం ముంబైలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ నెల 15న సీబీఐ విచారణకు హాజరైన విజయ్‌.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా బయటకు వచ్చినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేగాక సెన్సార్‌ బోర్డు సైతం విజయ్‌ సినిమాను పునఃపరిశీలించేందుకు తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. త్రిష కృషి వల్లనే ఇది సాధ్యమైందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు.. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కుమారుడు మిధున్‌ కూడా పలు మార్లు త్రిషతో సమావేశమైనట్లు తెలిసింది.

Updated Date - Mar 18 , 2026 | 04:27 AM