11లో 8 రాజ్యసభ సీట్లు ఎన్డీయేవే..
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:38 AM
రాజ్యసభలో 11 స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏడు సీట్లు గెలుపొందింది. మరో సీటులో ఎన్డీయే మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
న్యూఢిల్లీ, మార్చి 16: రాజ్యసభలో 11 స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏడు సీట్లు గెలుపొందింది. మరో సీటులో ఎన్డీయే మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బిహార్‌లో 5స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అన్నింటిని అధికార కూటమే దక్కించుకుంది. బిహార్ సీఎం నితీశ్‌కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఒడిశాలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండు ఎన్డీయే అభ్యర్థులు, ఆ కూటమి మద్దతిచ్చిన ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఒక సీటును ప్రతిపక్ష బిజూ జనతాదళ్ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు బీజేడీ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరి ఓట్లతోనే స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రాయ్ గెలిచినట్లు సమాచారం. ఇక హరియాణాలో రెండు సీట్లకు జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావటంతో ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం నిలిపివేసింది. రాజ్యసభలో మొత్తం 37 మంది సభ్యుల పదవీకాలం పూర్తికాగా, ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన తర్వాత 26 మంది ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ సభ్యులు వేంనరేందర్‌రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ఉన్నారు.