రాజ్యసభలో 2/3 మెజారిటీ దిశగా ఎన్డీయే
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:36 AM
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తిరుగుబాటు పాలక పక్షం ఎన్డీయేకి కలిసి వచ్చింది. పార్లమెంటులో ఎన్డీయే సీట్లు పెరిగి ఉభయ సభల్లోనూ...
న్యూఢిల్లీ, జూన్ 14: తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తిరుగుబాటు పాలక పక్షం ఎన్డీయేకి కలిసి వచ్చింది. పార్లమెంటులో ఎన్డీయే సీట్లు పెరిగి ఉభయ సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీకి దగ్గరైంది. దీంతో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను కూడా సులువుగా ఆమోదించుకొనే అవకాశం ఉంది. లోక్‌సభలో మాత్రం 2/3 మెజారిటీకి 363 సీట్లు అవసరం కాగా టీఎంసీ ఎంపీలు 20 మంది మద్దతు ఇచ్చినా ఎన్డీయే బలం 313 సీట్లకే చేరుతుంది. ఇక రాజ్యసభలో ఎన్డీయేకి 148 మంది ఎంపీల బలం ఉండగా... ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న జార్ఖండ్, మిజోరాంలలో మూడు సీట్లు దక్కే అవకాశం ఉంది. అలాగే బెంగాల్‌లో ముగ్గురు టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయనుండడంతో ఉప ఎన్నికల్లో ఆ సీట్లనూ దక్కించుకోనుంది. దీంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 154 సీట్లకు చేరుతుంది. అయితే 2/3 మెజారిటీకి ఇంకా 9 సీట్లు తగ్గుతాయి. టీఎంసీ ఎంపీల్లో పలువురు రాజీనామా చేసే పరిస్థితి ఉండడంతో ఎన్డీయే రాజ్యసభలో 2/3 మెజారిటీకి చేరుకుంటుందని పరిశీలకుల అంచనా. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 మంది ఎంపీల పదవీ కాలం రానున్న నవంబరుతో పూర్తికానుండడంతో రాజ్యసభలో పాలకపక్షం బలం తగ్గే పరిస్థితీ ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న సీట్ల ప్రకారం వాటిలో కొన్ని సీట్లు సమాజ్‌వాదీ పార్టీకి దక్కే అవకాశం ఉండడమే ఇందుకు కారణం.