పోక్సో కేసులు ఏడేళ్లలో రెట్టింపు
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:56 AM
పసిమొగ్గలపై అత్యాచారాలు, బలవంతపు పెళ్లిళ్ల కోసం మైనర్ బాలికల కిడ్నా్‌పలతో ఆడుతూ.. పాడుతూ.. కేరింతలతో గడపాల్సిన బాల్యం బలిపీఠం ఎక్కుతోంది.
ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 24: పసిమొగ్గలపై అత్యాచారాలు, బలవంతపు పెళ్లిళ్ల కోసం మైనర్ బాలికల కిడ్నా్‌పలతో ఆడుతూ.. పాడుతూ.. కేరింతలతో గడపాల్సిన బాల్యం బలిపీఠం ఎక్కుతోంది. దేశవ్యాప్తంగా పిల్లలపై జరుగుతున్న నేరాలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం... 2016 నుంచి 2023 మధ్య కాలంలో పోక్సో చట్టం కింద నమోదైన కేసులు దాదాపు రెట్టింపయ్యాయి. ఇదే సమయానికి పిల్లలపై జరిగిన మొత్తం నేరాలు 40శాతం పెరిగాయి. 2016లో 36,022గా ఉన్న పోక్సో కేసులు 2023 నాటికి 67,694కు పెరిగాయి. ఈ కాలంలో పోక్సో బాధితుల సంఖ్య కూడా 36,321 నుంచి 68,636కు పెరిగింది. 2016-23 మధ్య దేశంలో నమోదైన పిల్లలపై నేరాలకు సంబంధించి మొత్తం కేసుల్లో పోక్సో కేసులు, బాధితులు 30 శాతానికి పైమాటే. ఈ లెక్కలు మైనర్లపై పెరుగుతున్న లైంగిక హింస తీవ్రతకు అద్దపడుతున్నాయి. పిల్లలపై జరిగిన మొత్తం నేరాలు 2016లో లక్ష మార్కును దాటగా, 2023 నాటికి 1.77 లక్షలకు చేరాయి. ఈ సమయానికి బాధితుల సంఖ్య కూడా 1.11 లక్ష నుంచి 1.86 లక్షలకు పెరిగింది. బాలికపై అత్యాచార కేసుల్లో 2023లో మహారాష్ట్ర(4,672) మొదటిస్థానంలో ఉంది.