Share News

పుస్తకాన్ని ఉపసంహరించుకున్నాం

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:08 AM

జ్యుడీషియరీ వ్యవస్థపై 8వ తరగతి టెక్ట్స్‌బుక్‌లో వివాదాస్పద పాఠ్యాంశం ముద్రించినందుకు ఎన్సీఈఆర్టీ బేషరుతుగా బహిరంగ క్షమాపణ చెప్పింది.

పుస్తకాన్ని ఉపసంహరించుకున్నాం

  • 8వ తరగతి సాంఘిక శాస్త్రంలోని వివాదాస్పద గ్రేడ్‌-2 పాఠ్య పుస్తకంపై ఎన్‌సీఈఆర్టీ వెల్లడి

  • బహిరంగ క్షమాపణ చెప్తూ ప్రకటన విడుదల

న్యూఢిల్లీ, మార్చి 10: జ్యుడీషియరీ వ్యవస్థపై 8వ తరగతి టెక్ట్స్‌బుక్‌లో వివాదాస్పద పాఠ్యాంశం ముద్రించినందుకు ఎన్సీఈఆర్టీ బేషరుతుగా బహిరంగ క్షమాపణ చెప్పింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘8వ గ్రేడ్‌ (పార్ట్‌-2)లో ‘సమాజం అన్వేషణ: ఇండియా, అంతకుముందు’ అనే సోషల్‌ టెక్స్ట్‌బుక్‌ పార్ట్‌ 2, చాప్టర్‌ 4లో ‘మన సమాజంలో జ్యుడీషియరీ పాత్ర’ అనే శీర్షికతో ఎన్సీఈఆర్టీ ఇటీవల పాఠ్యాంశం ముద్రించింది. ఆ పాఠ్యాంశం ముద్రించినందుకు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌, సభ్యులమందరం భేషరుతుగా, ఎటువంటి సమర్థనలూ లేకుండా క్షమాపణ చెబుతున్నాం. ఆ పుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించాం. ప్రస్తుతం అది అందుబాటులో లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘జ్యుడీషియరీలో అవినీతి’ అనే చాప్టర్‌ను ఆ పుస్తకంలో ముద్రించడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇటీవల సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. ‘‘భూమిపైన ఏ సంస్థ కూడా న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు’’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Updated Date - Mar 11 , 2026 | 04:08 AM