నక్సలిజం తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:08 AM
నక్సలిజంతో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని నక్సల్ ఉద్యమ అగ్రనాయకత్వమంతా...
డీకే అరుణ తండ్రి, సోదరుడిని చంపేశారు
వారి నాయకత్వమంతా ఏపీ, తెలంగాణ నుంచే..
నివారించడంలో నాటి ప్రభుత్వాల్లో అయోమయం
లోక్‌సభలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : నక్సలిజంతో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని నక్సల్ ఉద్యమ అగ్రనాయకత్వమంతా ఏపీ, తెలంగాణ నుంచే వచ్చిందని, వేణుగోపాల్‌రావు, రామచంద్రారెడ్డి, చండ్ర పుల్లారెడ్డి... ఇలా ఎందరో ఉన్నత వర్గాలకి చెందిన విద్యావంతులు వారిలో ఉన్నారని చెప్పారు. అగ్రకుల మేధావులు పట్టణాల్లోని లైబ్రరీల్లో కూర్చొని పేద దళిత యువకులను రిక్రూట్ చేసుకునేవారని విమర్శించారు. లోక్‌సభలో నక్సలిజం నిర్మూలనపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. తన సహచర ఎంపీ గోడం నగేష్ ఇంటిని నక్సలైట్లు పేల్చివేశారని, మరో ఎంపీ డీకే అరుణ తండ్రిని, సోదరుడిని నక్సలైట్లు చంపేశారని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సోదరుడిని కూడా నక్సల్స్ చంపేశారని అన్నారు. గ్రేహౌండ్స్ వ్యవస్థాపకుడు, తన స్కూల్ సీనియర్ ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్‌ను హైదరాబాద్ నగరం నడిబొడ్డున చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో నల్లమల అడవుల్లోని శ్రీశైలం ఆలయం సమీపంలో నక్సల్స్ అగ్రశ్రేణి నాయకులందరూ సమావేశమయ్యారని, పోలీసులు వారిని చుట్టుముట్టి కాంగ్రెస్ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తే మూడో రోజు వారిని వదిలేయాలని ఆదేశాలు పంపిందని ఆరోపించారు. ఇదంతా అప్పటి ప్రభుత్వాల అయోమయం వల్లే జరిగిందని విమర్శించారు. నక్సల్ ఉద్యమంలో కుల వివక్ష వల్ల చాపల ఎర్రయ్య అనే దళితుడు నక్సలిజాన్ని విడిచి పెట్టారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.