పశ్చిమాసియాకు ప్రయాణాలు వద్దు!
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:23 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమ సంఘం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్...
ఐటీ కంపెనీలకు నాస్కామ్ సూచన
పశ్చిమాసియాకు ప్రయాణాలను నిలిపివేసిన టీసీఎస్, విప్రో
న్యూఢిల్లీ, మార్చి 2: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమ సంఘం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తన సభ్య కంపెనీలకు కీలక సూచనలు చేసింది. పశ్చిమాసియాలోని ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను మానుకోవాలని పేర్కొంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పనిని (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రారంభించాలని పేర్కొంది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్న నాస్కామ్.. ఉద్యోగుల భద్రత పరిశ్రమకు అత్యంత ప్రాధాన్య అంశమని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు సభ్య కంపెనీలు ప్రయాణాలను వాయిదా వేయాలని, ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే ఏర్పాట్లను ప్రారంభించాలని సూచించింది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ కార్యకలాపాలు యధావిధిగానే కొనసాగుతున్నాయని, కంపెనీలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే అదనపు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. నాస్కామ్ పశ్చిమాసియా మండలితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రోలు పశ్చిమాసియాకు ప్రయాణాలను నిలిపివేశాయి. అలాగే తమ సిబ్బందికి అత్యవసర భద్రతా సలహాలను జారీ చేశాయి. పశ్చిమాసియా, ఆఫ్రికా ప్రాంతంలో టీసీఎ్‌సకు 9వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. యూఏఈ. ఖతార్, సౌదీ అరేబియా సహా దాదాపు 10-11 ప్రభావిత దేశాలకు ప్రయాణాలను విప్రో నిలిపివేసింది. అబుధాబి, దుబాయి, మస్కట్ (ఒమాన్), దోహా (ఖతార్), ఇస్తాంబుల్ (టర్కీ), అల్ సీఫ్ (బహ్రెయిన్), సౌదీ అరేబియాలోని పలు ప్రధాన నగరాలలో విప్రో సంస్థకు కార్యాలయాలున్నాయి.