స్వయం ప్రకటిత విశ్వగురువు ఒక్కపనీ నన్ను ఆకట్టుకోలేదు!
ABN , Publish Date - Feb 06 , 2026 | 02:44 AM
ప్రధాని మోదీ ‘స్వయం ప్రకటిత విశ్వగురువు’గా ప్రముఖ హిందీ నటుడు నసీరుద్దీన్ షా అభివర్ణించారు. ఆయన్ను తాను ఎప్పుడూ కీర్తించలేదని చెప్పారు.
ఆయన్ను నేను ఎప్పుడూ కీర్తించలేదు
ప్రధాని మోదీపై నసీరుద్దీన్ షా విమర్శలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రధాని మోదీ ‘స్వయం ప్రకటిత విశ్వగురువు’గా ప్రముఖ హిందీ నటుడు నసీరుద్దీన్ షా అభివర్ణించారు. ఆయన్ను తాను ఎప్పుడూ కీర్తించలేదని చెప్పారు. గత పదేళ్లలో స్వయం ప్రకటిత విశ్వగురువు చేసిన ఒక్కపనీ తనను ఆకట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికకు నసీరుద్దీన్ షా ఓ వ్యాసం రాశారు. ఇటీవల ముంబై యూనివర్సిటీ తాము నిర్వహిస్తున్న ‘జష్న్-ఎ-ఉర్దూ’ కార్యక్రమం కోసం నసీరుద్దీన్ షాను ఆహ్వానించింది. ఆ కార్యక్రమానికి ఆయన హాజరుకాలేదు. అయితే కార్యక్రమానికి వెళ్లేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని, కానీ ముందురోజు రాత్రి వర్సిటీ అధికారులు ఫోన్ చేసి రావొద్దని చెప్పడంతోనే తాను వెళ్లలేదని ఆ వ్యాసంలో నసీరుద్దీన్ షా వివరణ ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, నేతలపై తాను బహిరంగంగా చేస్తున్న విమర్శల కారణంగానే ఆహ్వానాన్ని వెనక్కి తీసుకొని ఉంటారని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ‘స్వయం ప్రకటిత విశ్వగురువు’ను తాను ఎప్పుడూ పొగడలేదని చెప్పారు. మోదీ పేరును ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే స్వయం ప్రకటిత విశ్వగురువు ప్రవర్తించే విధానంపైనే తాను విమర్శలు చేశానని.. ఆయన తనను తాను కీర్తించుకునే ధోరణే తనకు నచ్చదని చెప్పారు. తన విమర్శలు దేశంపైన కాదని, అధికారంలో ఉన్నవారు ప్రవర్తిస్తున్న తీరుపైనేనని స్పష్టం చేశారు. ‘గొప్ప నాయకుడు’ అని పొగడకపోతే దేశ వ్యతిరేకులుగా ముద్రపడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.