మామా.. వస్తున్నాం!
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:57 AM
చందమామను చుట్టివచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా తలపెట్టిన మానవసహిత మిషన్ ఆర్టెమిస్-2 ప్రయోగం విజయవంతంగా జరిగింది.
‘ఆర్టెమిస్-2’ మిషన్‌లో తొలి అంకం విజయవంతం
నలుగురు వ్యోమగాములతో.. నిప్పులు చిమ్ముతూ
జాబిల్లి దిశగా దూసుకుపోయిన నాసా రాకెట్
కేప్ కెనవెరాల్, ఏప్రిల్ 2: చందమామను చుట్టివచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా తలపెట్టిన మానవసహిత మిషన్ ఆర్టెమిస్-2 ప్రయోగం విజయవంతంగా జరిగింది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ వ్యోమనౌకను మోసుకుంటూ ఎస్‌ఎల్‌ఎస్ రాకెట్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3.54 గంటలకు నింగిలోకి దూసుకుపోయింది. రాకెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఐదు నిమిషాలకు.. ‘‘చందమామ ఉదయిస్తున్న దృశ్యం చాలా అందంగా కనిపిస్తోంది. మేం దాని దిశగానే వెళ్తున్నాం’’ అని ఫ్లైట్ కమాండర్ రీడ్ వైజ్‌మన్ అన్నారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత జాబిల్లి సమీపానికి మానవులను పంపడానికి నాసా చేపట్టిన యాత్ర కావడంతో.. స్థానికంగా వేలాది మంది ప్రజలు ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆ ప్రాంతంలోని రహదారులు, బీచ్‌లలో గుమిగూడి.. రాకెట్ నింగిలోకి దూసుకకుపోగానే పెద్దపెట్టున అరుస్తూ, హర్షధ్వానాలు చేస్తూ తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. అంతేకాదు.. యాభై ఏళ్ల క్రితం నాసా అపోలో మిషన్స్‌లో పాల్గొన్న వ్యోమగాముల్లో ఇప్పటికీ జీవించి ఉన్న కొందరు వ్యోమగాములు కూడా.. ఈ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.