ఇది మా సమస్య!
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:23 AM
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చర్యలకు ప్రయత్నించిన అంశంపై రగడ కొనసాగుతోంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా బీసీఐ తీరును తప్పుబట్టింది.
నాకు, విద్యార్థులకు మధ్య బార్ కౌన్సిల్ జోక్యం అనవసరం
విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంది
నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా
స్పష్టం చేసిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి చర్యలూ వద్దని బీసీఐ, రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఆదేశం
బీసీఐకి ఇలా ఆదేశించే అధికారం ఉందా?
మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించాక బీసీఐ ఆదేశాలపై స్పందిస్తాం: నల్సార్ వీసీ
బార్ కౌన్సిల్ మానన్‌కుమార్ సొంత ఆస్తి కాదు
సుప్రీం బార్ అసోసియేషన్ ఆగ్రహం
12 ఏళ్లకుపైగా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్న
చీఫ్ జస్టిస్ రాకను వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై విచారణ చేపట్టాలని ఆదేశించే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కి ఉందా? అది రాజ్యాంగబద్ధమా? అన్నది మేం పరిశీలించాల్సి ఉంది. యూనివర్సిటీ పాలనా నిబంధనల ప్రకారం అది అనుమతించదగినదేనా? అన్న అంశాన్ని పరిశీలించేందుకు ఈ విషయాన్ని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు పెడతాం. కౌన్సిల్‌లో చర్చ అనంతరం బీసీఐకి మా స్పందన తెలియజేస్తాం.
- నల్సార్ వర్సిటీ వైస్ చాన్సలర్ శ్రీకృష్ణదేవరావు
న్యూఢిల్లీ, ఆగస్టు 14: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చర్యలకు ప్రయత్నించిన అంశంపై రగడ కొనసాగుతోంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా బీసీఐ తీరును తప్పుబట్టింది. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇక విద్యార్థులపై విచారణ చేపట్టాలని ఆదేశించే అధికారం బీసీఐకి ఉందా? అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉందని నల్సార్ వర్సిటీ వైస్ చాన్సలర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో సీజేపీ నేతలు కూడా బీసీఐ తీరును తప్పుబట్టారు. మానన్‌కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించవద్దని.. జెన్ జీ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి తాలూకు వీడియోలను చూడడానికి సమయం లేదన్న సీజేఐ చేతుల మీదుగా తాము పట్టాలు అందుకోబోమని కొందరు విద్యార్థులు వర్సిటీ వీసీకి లేఖ రాయడం..
దీనిపై ఆగ్రహించిన బీసీఐ చైర్మన్ మానన్‌కుమార్ మిశ్రా.. నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థులను అడ్వొకేట్లుగా నమోదు చేసుకోవద్దంటూ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీనిపై కలకలం రేగడంతో బీసీఐ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. బీసీఐ ఆదేశాలను ప్రశ్నిస్తూ వర్సిటీ పూర్వ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంది. ఇది చీఫ్ జస్టి్‌సకు, విద్యార్థులకు మధ్య సమస్య. ఇందులో జోక్యం చేసుకోవడానికి బీసీఐ ఎవరు? అసలు బార్ కౌన్సిల్ పాత్ర ఏమిటి?’’ అని సీజేఐ పేర్కొన్నారు. తాను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నానని చెప్పారు. న్యాయ విద్యార్థులు ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన వారి వృత్తిపరమైన భవిష్యత్తును దెబ్బతీయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఈ అంశంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని బీసీఐని ఆదేశించారు. అలాగే నల్సార్ న్యాయ విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని బీసీఐకి, రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, జంతర్‌మంతర్ సీజేపీ నిరసనల్లో పాల్గొన్న ఒక మహిళ.. తనను అత్యాచారం చేస్తామని, కిడ్నాప్ చేస్తామని బెదిరింపులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. నిరసనలకు సంబంధించిన ఇతర పిటిషన్లతో కలిపి ఈ నెల 18న దీనిపై విచారణ జరుపుతామన్నారు.
బార్ కౌన్సిల్ ఆయన ఆస్తి కాదు
నల్సార్ విద్యార్థులపై చర్యలు చేపట్టాలన్న బీసీఐ చైర్మన్ మానన్‌కుమార్ మిశ్రా తీరును సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బీసీఐ తన సొంత ఆస్తి అన్నట్టుగా చైర్మన్ వ్యవహరిస్తున్నారు. బీసీఐ నిబంధనల ప్రకారం.. చైర్మన్ ఎంపిక ఏడాదికోసారి జరుగుతుంది. ఎవరైనా సరే నాలుగు సార్లకు మించి ఆ పదవి చేపట్టడానికి లేదు. కానీ, మిశ్రా 12 ఏళ్లుగా చైర్మన్‌గా ఎలా కొనసాగుతున్నారో అర్థంకావడం లేదు. అంతేకాదు 12 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగుతున్నారు’’ అని సింగ్ పేర్కొన్నారు. అయితే సీజేఐని స్నాతకోత్సవానికి ఆహ్వానించవద్దన్న విద్యార్థులను తాను సమర్థించడం లేదన్నారు.