మహారాష్ట్రలో 17 మంది సజీవ దహనం
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:20 AM
మైనింగ్-పారిశ్రామిక పేలుడు పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 17 మంది సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టడానికి వీలులేని విధంగా...
మైనింగ్-పారిశ్రామిక పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో విస్ఫోటం
నాగ్‌పూర్, మార్చి 1: మైనింగ్-పారిశ్రామిక పేలుడు పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 17 మంది సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టడానికి వీలులేని విధంగా మృతదేహాలు కాలిపోవడంతో మృతుల గుర్తింపు కోసం కుటుంబసభ్యుల నుంచి డీఎన్‌ఏ శాంపిళ్లను అధికారులు సేకరిస్తున్నారు. ఘటనలో మరో 18 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా కాటో ల్ మండలం రావుల్‌గావ్ గ్రామంలో ఉన్న ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఆదివా రం ఉదయం ఈ పేలుడు సంభవించింది. ఘటన స్థలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎ్‌ఫతోపాటు పీఈఎ్‌సవో(పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫిటీ ఆర్గనైజేషన్), డీఐఎ్‌సఎ్‌స(డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ సెక్యూరిటీ) బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నామన్నారు. స్థానిక అధికారుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని వెల్లడించారు. కాగా, కంపెనీకి చెందిన ప్యాకింగ్ యూనిట్‌లో ఉదయం 7 గంటల నుంచి 7.15 గంటల మధ్యలో ఈ పేలుడు సంభవించిందని ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆ సమయంలో పేలు డు పదార్థాల తయారీ ప్రక్రియలేమీ జరగడం లేదు. పేలుడుకు కారణం ఏమిటనేదానిపై దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం’ అని పేర్కొంది. తక్షణమే అత్యవసర స్పందన ప్రొటోకాల్స్‌ను అమలు చేశామని, పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని తెలిపింది. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.