దీదీకి తగ్గిన ముస్లింల మద్దతు!
ABN , Publish Date - May 05 , 2026 | 05:01 AM
పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న నియోజకవర్గాల సంఖ్య 54. వీటిలో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఏకంగా 52 సీట్లు గెల్చుకుంది. ఒకటి మాత్రమే బీజేపీకి దక్కింది.
ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బీజేపీకి పెరిగిన సీట్లు
కోల్‌కతా, మే 4: పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న నియోజకవర్గాల సంఖ్య 54. వీటిలో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఏకంగా 52 సీట్లు గెల్చుకుంది. ఒకటి మాత్రమే బీజేపీకి దక్కింది. ఈసారి పరిస్థితి మారింది. తృణమూల్‌కు పట్టున్న ఈ స్థానాల్లోకి బీజేపీ చొచ్చుకెళ్లింది. 12 స్థానాల్లో విజయం సాధించినట్లు ఫలితాలు వెల్లడించాయి. 2011 నాటి గణాంకాల ప్రకారం పశ్చిమ బెంగాల్ జనాభాలో ముస్లింలు 27 శాతం ఉన్నారు. ప్రస్తుతం ఇది 32 శాతానికి పెరిగి ఉంటుందని ఇటీవల మమతా బెనర్జీ పేర్కొన్నారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాల్లో ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలున్నాయి. మమత ఈ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయటం ద్వారా తన గెలుపునకు దారులు వేసుకున్నారు. తొలిసారి తృణమూల్ అధికారంలోకి వచ్చిన 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 21 ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలలో ఆ పార్టీ గెల్చింది. 2016లో ఈ సంఖ్య 28కి పెరిగింది. 2021లో ఏకంగా 52కి చేరుకుంది. కానీ ఈసారి ముస్లింల ఓట్లు గంపగుత్తగా తృణమూల్‌కు పడినట్లు కనిపించటం లేదు. ఇతర పార్టీలకు కూడా వారి ఓట్లు పోలైనట్లుగా తెలుస్తోంది. బీజేపీకి కూడా కొంత భాగం ముస్లిం ఓటుబ్యాంకు అండగా నిలిచిందని, అందువల్లే ముస్లిం ప్రాబల్య సీట్లలోనూ మెరుగైన ఫలితాలు సాధించామని ఆ పార్టీ నేత సువేందు అధికారి తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారెంటీలను కూడా ముస్లింలు విశ్వసించారని పేర్కొన్నారు. కాగా, ఎస్‌ఐఆర్ ప్రక్రియ కూడా ముస్లిం ఓటర్ల ప్రాబల్యాన్ని కొంతమేర తగ్గించిందన్న వాదనలున్నాయి. ముర్షిదాబాద్ జిల్లాలో 4.5 లక్షల ముస్లింల పేర్లను, మాల్దాలో 2.3 లక్షల ముస్లింల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇది ఆయా జిల్లాల్లో సమీకరణలను మార్చింది. కొత్తగా ఈసీ చేర్చిన ఓటర్ల సంఖ్య ఇతర ప్రాంతాలతో పోల్చితే ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లో తక్కువగానే ఉంది. నికరంగా ఈ ప్రాంతాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇది కూడా తృణమూల్ సీట్ల సంఖ్య గతంలో కంటే పడిపోవటానికి ఒక కారణమైంది.