త్వరలోనే ఎంఆర్‌ఎఫ్ఏ ఒప్పందం: ఐఏఎఫ్ చీఫ్
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:02 AM
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎంఆర్‌ఎఫ్ఏ) ఒప్పందం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఖరారయ్యే అవకాశం ఉందని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 3: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎంఆర్‌ఎఫ్ఏ) ఒప్పందం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఖరారయ్యే అవకాశం ఉందని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. ఈ నెల 8న ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మనకున్న మొత్తం సైనిక బలంలో వైమానిక శక్తి కీలకమైనదని, ఏఐ సాయంతో దాని సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉందని చెప్పారు. మనకు ఏఐ ఆధారిత దళం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధ సన్నద్ధతకు స్వయం సమృద్ధి అత్యంత కీలకమన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఐఏఎఫ్‌కు ఏటా 36 నుంచి 40 యుద్ధ విమానాలు అవసరమని, వాటి ఇంజన్లను దేశీయంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని ఐఏఎఫ్ చీఫ్ స్పష్టం చేశారు. స్వదేశీ యుద్ధ విమానాల తయారీ కార్యక్రమం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ) ఆలస్యమైతే ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. భారత్‌కు సుఖోయ్-57 (ఎస్‌యూ-57) జెట్‌లను రష్యా ఆఫర్ చేసిందని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.