ఎంపీ రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసు
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:12 AM
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటు ప్రాంగణంలోకి తీసుకురావడంతోపాటు...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటు ప్రాంగణంలోకి తీసుకురావడంతోపాటు ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఈ నోటీసు జారీ చేశారు. గత శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా రేణుకా చౌదరి తాను రక్షించిన ఒక వీధి కుక్కను కారులో పార్లమెంటుకు తీసుకెళ్లారు. దీనిపై అక్కడున్న కొందరు సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ‘‘లోపల కూర్చున్నవారే కరుస్తారు.. కుక్కలు కరవవు’’ అని ఆమె అన్నారంటూ బీజేపీ ఎంపీలు బ్రిజ్‌లాల్, ఇందుబాల గోస్వామి ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఎంపీలపై ధిక్కారపూరిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశం ప్రివిలేజ్ కమిటీ ముందుకు వెళ్లగా.. గతవారం జరిగిన సమావేశాల్లో కమిటీ దీనిపై చర్చించి ఆరోపణలపై ఈ నెల 23లోగా రాతపూర్వక సమాధానమివ్వాలంటూ రేణుకా చౌదరికి నోటీసు ఇచ్చింది. రేణుకాచౌదరి కార్యాలయవర్గాలు స్పందిస్తూ.. పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం సమాధానమిస్తామని తెలిపాయి.