భోజ్‌శాల.. సరస్వతి ఆలయమే!
ABN , Publish Date - May 16 , 2026 | 04:01 AM
మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల/కమల్ మౌలా కట్టడం సరస్వతి దేవి ఆలయమేనని ఆ రాష్ట్ర హైకోర్టు తేల్చింది. ముస్లింలు వాదిస్తున్నట్టు అక్కడ మొదటి నుంచీ మసీదు లేదని వెల్లడించింది.
దశాబ్దాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
ఇండోర్ /హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల/కమల్ మౌలా కట్టడం సరస్వతి దేవి ఆలయమేనని ఆ రాష్ట్ర హైకోర్టు తేల్చింది. ముస్లింలు వాదిస్తున్నట్టు అక్కడ మొదటి నుంచీ మసీదు లేదని వెల్లడించింది. సరస్వతి ఆలయ శిథిలాలతోనే ప్రస్తుత కట్టడాన్ని నిర్మించారని స్పష్టంచేసింది. భోజ్‌శాలలో హిందువులు, ముస్లింలు వేర్వేరు వారాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ 2003 ఏప్రిల్ 7న భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. భోజ్‌శాలలో హిందువులకు సంపూర్ణ ప్రార్థనా హక్కులను కల్పిస్తూ ఇండోర్ ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. మసీదు కోసం వేరే స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరే వెసులుబాటును ముస్లిం సంస్థలకు కల్పించింది. ‘‘భోజ్‌శాలలో సరస్వతి ఆలయంతోపాటు సంస్కృత బోధనా కేంద్రం జాడలు కనిపిస్తున్నాయి. ఈ స్థలం ధార్మిక లక్షణాలను బట్టి అది ఆలయమేనని తెలుస్తోంది. క్రీస్తుశకం 9-11 శతాబ్దాల మధ్య మాల్వా ప్రాంతాన్ని పాలించిన పర్మార్ వంశానికి చెందిన భోజ మహారాజుకు ఇక్కడి నిర్మాణాలతో సంబంధం ఉంది. ఏఎస్ఐ ఈ విషయాలను శాస్ర్తీయంగా ధ్రువీకరించింది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిందూ పిటిషనర్లు వేసిన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించింది. మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ అసోసియేషన్, హిందూ, జైన భక్తులు సహా పలువురు వేసిన ఐదు పిటిషన్లు, ఒక రిట్ అప్పీల్‌ను విచారించింది. గత నెల ఆరోతేదీ నుంచి ప్రతిరోజూ వాదనలు వింటూ ఈ నెల 12వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. హిందూ, ముస్లిం, జైన సంస్థల ప్రతినిధులు భోజ్‌శాలపై ప్రార్థ నా హక్కుల కోసం గట్టిగా వాదనలు వినిపించారు. అది మధ్యయుగాల నాటి జైన మందిరమని జైనులు వాదించారు. ముస్లింలు ప్రతి శుక్రవారం, హిందువులు ప్రతి మంగళవారం భోజ్‌శాలలో ప్రార్థనలు జరుపుకొనే హక్కును గతంలో పురావస్తు శాఖ కల్పించింది. దీనిని హిందువులు హైకోర్టులో 2024 మార్చి 11న సవాల్ చేశారు. అక్కడ పూజలు చేసుకునే పూర్తి హక్కు తమకు మాత్రమే ఇవ్వాలని వాదించారు. కాగా, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రముఖ ముస్లిం మత పెద్ద, ధార్ షహర్ ఖ్వాజీ వాకర్ సాదిక్ తెలిపారు. కాగా, భోజ్‌శాలలో ఉన్నది ఆలయమేనంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దుచేస్తుందనే నమ్మకం ఉన్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భోజ్‌శాల మసీదు 700 ఏళ్లుగా అధికారిక రికార్డుల్లో ఉందని శుక్రవారం తెలిపారు. 1935లో ధార్ రాష్ట్ర గెజిట్‌లోనూ అది మసీదుగానే ఉందని ఆయన చెప్పారు.