Share News

నాటి సంద్రమే నేటి ఎవరెస్టు!

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:58 AM

ఎవరెస్టు... హిమాలయా పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రపంచలోనే అత్యంత ఎత్తయిన శిఖరం. ఎవరెస్టు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఇది. సముద్రపు మట్టానికి 8,848.86 మీటర్ల ఎత్తున..

నాటి సంద్రమే నేటి ఎవరెస్టు!

8వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు శిలల్లో 47కోట్ల ఏళ్ల నాటి సముద్రపు జీవుల అవశేషాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9 : ఎవరెస్టు... హిమాలయా పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రపంచలోనే అత్యంత ఎత్తయిన శిఖరం. ఎవరెస్టు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఇది. సముద్రపు మట్టానికి 8,848.86 మీటర్ల ఎత్తున ఉన్న ఓ మంచు పర్వతమైన ఎవరెస్టు.. నేటి ప్రపంచానికి ఒక విధంగా పైకప్పులాంటిది. అలాంటి ఎవరెస్టు శిఖరం ఒకప్పుడు సముద్రమంటే నమ్మగలరా..: ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఎవరెస్టు పర్వతం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఓ సముద్రంలో భాగమని వివిధ పరిశోధనలు వెల్లడించాయి. ఎవరెస్టు అంటే కేవలం మంచు పర్వతాలు మాత్రమే కాదని, అందులో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని ఆ పరిశోధనలు తేల్చాయి. వందల లక్షల సంవత్సరాల క్రితం సముద్ర వాతావరణంలో నివసించిన జీవుల అవశేషాలు ఎవరెస్టు పర్వతంలో 8,000మీటర్ల ఎత్తున ఉన్న కొన్ని శిలల్లో పరిశోధకులు గుర్తించారు. దశాబ్దాల పాటు చేసిన పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు.


ఎవరెస్టులో ప్రాచీన సముద్ర జీవుల అవశేషాలు

ఎవరెస్ట్‌ పర్వత శ్రేణుల్లోని రాళ్లను పరిశీలించిన పరిశోధకులు వాటిల్లో ఆర్డోవిషియన్‌ కాలానికి(సుమారు 485 మిలియన్‌ సంవత్సరాల క్రితం) చెందిన ట్రైలోబైట్స్‌, ఆస్ట్రాకాడ్స్‌, క్రినాయిడ్స్‌ వంటి ప్రాచీన సముద్రజీవుల అవశేషాలను కనుగొన్నారు. జియాలజీ ఆఫ్‌ ద సమ్మిట్‌ లైమ్‌స్టోన్‌ ఆఫ్‌ మౌంట్‌ ఖోమోలాంగ్మా(ఎవరెస్ట్‌) అండ్‌ కూలింగ్‌ హిస్టరీ ఆఫ్‌ ద ఎల్లో బ్యాండ్‌ అండర్‌ ఖోమోలాంగ్మా డిటాచ్‌మెంట్‌’’ అనే అధ్యయనం 2005లో ‘ఐలాండ్‌ ఆర్క్‌’లో ప్రచురితమైంది. అలాగే, అమెరికాలోని మోంటానా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం ఎవరెస్టుపై చేసిన అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. లోయర్‌ లేదా మధ్య ఆర్డోవిషియన్‌ కాలానికి చెందిన సముద్ర జీవుల అవశేషాలు కలిగిన శిలలు ఎవరెస్టులో ఉన్నాయని పేర్కొంది. అలాగే, జర్నల్‌ ఆఫ్‌ స్ట్రక్చరల్‌ జియాలజీలో 2005లో ప్రచురితమైన ద స్ట్రక్చరల్‌ ఎవల్యూషన్‌ ఆఫ్‌ ద ఖోమోలాంగ్మా ఫార్మేషన్‌, మౌంట్‌ ఎవరెస్ట్‌, నేపాల్‌’’ కూడా ఇదే విషయం చెబుతోంది. క్రినాయిడ్‌, బ్రాచీపోడ్‌, ఆస్ట్రాకాడ్‌ జీవుల అవశేషాలను ఎవరెస్టు శిఖరంలోని రాళ్లలో గుర్తించామని తెలిపింది.

సముద్ర గర్భం నుంచి అంత ఎత్తుకు..

హిమాలయాలు ఏర్పడడానికి ముందు ప్రస్తుత ఎవరెస్టు ప్రాంతం భారతీయ భూఫలకానికి ఉత్తర అంచున, ప్రాచీన టెథిస్‌ సముద్ర పరిధిలోనూ ఉండేది. ఆ సమయంలో సముద్ర వాతావరణంలో పేరుకుపోయిన అవశేషాలు కాలక్రమంలో శిలలుగా మారాయి. ఆ తర్వాత భారతీయ భూఫలకం ఉత్తర దిశగా కదులుతూ యురేషియా భూఫలకాన్ని ఢీకొట్టింది. దాంతో సముద్రం అడుగున ఉన్న శిలలు భూఫలకాల కదలికల వల్ల వేల మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. ఇందుకు ఎవరెస్టు శిఖరంలో ప్రస్తుతం లభిస్తున్న శిలలే సాక్ష్యాలని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఎవరెస్టు అంతా ఒకప్పుడు సముద్రంలో మునిగి ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుతం ఎవరెస్టులో భాగమైన కొన్ని శిలలు ఒకప్పుడు ప్రాచీన సముద్రపు అడుగున ఏర్పడ్డాయని చెప్పడం శాస్త్రీయంగా సరైనదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 04:59 AM