దేశంలోని 43శాతం ప్రాంతాల్లో లోటు వర్షపాతం
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:43 AM
ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని 43ు ప్రాంతాల్లో వర్షపాతం లోటు కొనసాగుతుండగా.. దేశం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. పశ్చిమ రాజస్థాన్‌లోని రాంగఢ్, మోహన్‌గఢ్, ఫలోడీ, ఖాజువాలా ప్రాంతాల నుంచి శనివారం రుతుపవనాలు నిష్క్రమించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది.
రెండు రోజులు ఆలస్యంగా
‘నైరుతి’ నిష్క్రమణ షురూ
దేశంలోని 43శాతంప్రాంతాల్లో వర్షపాతం లోటు
రెండు రోజులు ఆలస్యంగా ‘నైరుతి’ నిష్క్రమణ ప్రారంభం
ఏపీలో 43, తెలంగాణలో 21 శాతం లోటు
బెంగళూరు, సెప్టెంబరు 20: ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని 43ు ప్రాంతాల్లో వర్షపాతం లోటు కొనసాగుతుండగా.. దేశం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. పశ్చిమ రాజస్థాన్‌లోని రాంగఢ్, మోహన్‌గఢ్, ఫలోడీ, ఖాజువాలా ప్రాంతాల నుంచి శనివారం రుతుపవనాలు నిష్క్రమించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. సాధారణంగా సెప్టెంబరు 17న దేశం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ ఏడాది రెండు రోజులు ఆలస్యంగా(సెప్టెంబరు 19న) రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. రానున్న మూడు నాలుగు రోజుల్లో రాజస్థాన్‌లోని మరిన్ని ప్రాం తాలు, పంజాబ్, కచ్-సౌరాష్ట్రల నుంచి రుతుపవనాలు నిష్క్రమించనున్నట్టు ఐఎండీ ప్రకటించింది. అత్యధికంగా మేఘాలయలో 59ు వర్షపాతం లోటు కొనసాగుతుండగా.. దాని తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్(-43శాతం), అరుణాచల్‌ప్రదేశ్(-41శాతం), బిహార్(-36శాతం), గోవా(-35శాతం), కర్ణాటక(-31శాతం), కేరళ(-28శాతం), అసోం(-26శాతం), తమిళనాడు(-22శాతం), హరియాణా(-22శాతం), తెలంగాణ(-21శాతం) ఉన్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్‌లో ఒక్క జూలైలో మాత్రమే కాస్త మెరుగైన వర్షపాతం(సాధారణం కంటే ఒక శాతం ఎక్కువ) నమోదైంది. మిగిలిన జూన్, ఆగస్టు, సెప్టెంబరులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే, ఉత్తర అండమాన్ సముద్రంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ తెలిపింది. ఇది మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి రానుందని, బుధవారం దక్షిణ ఒడిసా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటనుందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చేవారం రోజులు కోస్తాంధ్రతోపాటు పశ్చిమబెంగాల్‌లోని గంగాతీర ప్రాంతాలు, ఒడిసా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, సిక్కింలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.