ఏమరుపాటుగా ఉండొద్దు!
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:28 AM
కఠోర శ్రమ, ప్రజానుకూల విధానాల వల్లే అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌డీఏ వరుస విజయాలు సాధిస్తోందని.. అయినా సరే ఏమరుపాటుగా ఉండొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు.
ఎంపీలంతా నియోజకవర్గాల్లో సంక్షేమ పనులు కొనసాగించాలి
ఎన్‌డీఏ ఎంపీల భేటీలో మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కఠోర శ్రమ, ప్రజానుకూల విధానాల వల్లే అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌డీఏ వరుస విజయాలు సాధిస్తోందని.. అయినా సరే ఏమరుపాటుగా ఉండొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో చేస్తున్న మంచి పనులను, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ఈ విజయాలతో సంతృప్తి చెందడమో, అలసత్వంతో ఉండడమో చేయొద్దని.. క్షేత్రస్థాయిలో లేకపోతే గెలవలేమని స్పష్టం చేశారు.. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఆ తర్వాత ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. నియోజకవర్గాల్లో చేయాల్సిన పనులను ప్రధాని ఎంపీలకు విస్తృత మార్గదర్శకాలిచ్చారన్నారు.