Share News

Prime Minister Modi: మహా జంగిల్‌రాజ్‌ను అంతం చేస్తాం

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:00 AM

తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలోని ‘మహా జంగిల్‌ రాజ్‌’కు వీడ్కోలు పలకడానికి పశ్చిమ బెంగాల్‌ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.

Prime Minister Modi: మహా జంగిల్‌రాజ్‌ను అంతం చేస్తాం

  • కేంద్ర పథకాలను టీఎంసీ సర్కారు అడ్డుకుంటోంది

  • ఓట్ల కోసం అక్రమ వసలదారులకు మద్దతు

  • బెంగాల్‌ ర్యాలీలో మోదీ

సింగూరు/కలియాబోర్‌, జనవరి 18: తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలోని ‘మహా జంగిల్‌ రాజ్‌’కు వీడ్కోలు పలకడానికి పశ్చిమ బెంగాల్‌ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీయే బిహార్‌లో ‘జంగిల్‌ రాజ్‌’ను అంతం చేసిందని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా సింగూర్‌లో, అస్సాం రాష్ట్రం కలియాబోర్‌లో ఆదివారం నిర్వహించిన ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. ‘‘ఇండియా గేట్‌ ముందు సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది బీజేపీ ప్రభుత్వమే. మొదటిసారిగా ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సేవలకు ఎర్రకోట వద్ద గౌరవం లభించింది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని ఒక ద్వీపానికి నేతాజీ పేరు పెట్టాం. మీరు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడే బెంగాలీ భాషకు శాస్త్రీయ హోదా దక్కింది. బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే దుర్గా పూజకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఒక్క మోదీకి మాత్రమే బెంగాల్‌పై ఇంత ప్రేమ ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. బెంగాల్‌కు చెందిన రాజారామ్మోహన్‌ రాయ్‌, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, స్వామి వివేకానంద వంటి మహనీయులను జాతీయ స్థాయిలో గౌరవించింది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను బెంగాల్‌ ప్రజలకు అందకుండా టీఏంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. బెంగాల్‌ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తొలగించాలో, వద్దో చెప్పాలని ప్రజలను మోదీ కోరారు. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఎంసీ ప్రభుత్వం చొరుబాటుదారులకు మద్దతు ఇస్తూ దేశ భద్రతను ప్రమాదంలోని నెడుతోందని మోదీ ఆరోపించారు. నకిలీ పత్రాలతో బెంగాల్‌లో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను తరిమికొడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో రూ.830 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు ఢిల్లీ, వారాణసీ, చెన్నైలను కోల్‌కతాను అనుసంధానం చేసే మూడు అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అస్సాంలోని కలియాబోర్‌లో మోదీ ప్రసంగిస్తూ అస్సాంలోకి పెద్దఎత్తున వచ్చిన చొరుబాటుదారులకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇక్కడి భూములను అప్పగించిందని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారికి దశాబ్దాల తరబడి రాష్ట్రంలో ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించారు. ‘చొరుబాటుదారులు జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. సంస్కృతిపై దాడి చేస్తున్నారు. యువత ఉద్యోగాలను లాక్కుంటున్నారు. ఇది అస్సాంతో పాటు దేశ భద్రతకు తీవ్రముప్పుగా పరిణమించింది’ అని మోదీ పేర్కొన్నారు. చొరుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బీజేపీ ప్రభుత్వం అస్సాం సంస్కృతిని కాపాడుతోందన్నారు. నాగావ్‌ జిల్లాలో రూ.6,957 కోట్లతో చేపట్టనున్న కాజీరంగా ఎలివేటెడ్‌ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు.

Updated Date - Jan 19 , 2026 | 04:00 AM