తమిళంపై ఉమ్మడి ప్రేమ ఇరుదేశాలను కలుపుతోంది
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:39 AM
ఉగ్రవాదం విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు. రాజీపడే ప్రసక్తే లేదు’’ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
మలేషియాలో ప్రధాని మోదీ వ్యాఖ్య
కౌలాలంపూర్, ఫిబ్రవరి 8: ‘‘ఉగ్రవాదం విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు. రాజీపడే ప్రసక్తే లేదు’’ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద నిరోధం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సముద్ర భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తామని, అదే సమయంలో రక్షణ సహకారాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీలు, ఆరోగ్య సంరక్షణ, జాతీయ భద్రత, సెమీకండక్టర్లు, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందిస్తామని ప్రకటించారు. మలేషియాతో భారత్‌కు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. భారతీయ మూలాలున్న జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం మలేషియా అని చెప్పారు. రెండు దేశాల ప్రజల మధ్య గాఢమైన, ఆప్యాయతతో కూడిన సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తమిళ భాషపై ఉన్న ఉమ్మడి ప్రేమ ఇరు దేశాలనూ కలుపుతోందన్నారు. మరోవైపు, ద్వైపాక్షిక లావాదేవీల్లో సాధ్యమైనంత వరకూ స్థానిక కరెన్సీలను ఉపయోగించాలన్న భారత నిర్ణయాన్ని అన్వర్ స్వాగతించారు. మోదీ మలేషియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.