Share News

వంద మందిని బుజ్జగిస్తేనే మోదీ విజయం!

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:16 AM

మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రతిపక్షానికి చెందిన దాదాపు వంద ఎంపీలను బుజ్జిగించాల్సి ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

వంద మందిని బుజ్జగిస్తేనే మోదీ విజయం!

  • మహిళా రిజర్వేషన్‌, పునర్విభజన బిల్లుల ఆమోదానికి బీజేపీ వ్యూహాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రతిపక్షానికి చెందిన దాదాపు వంద ఎంపీలను బుజ్జిగించాల్సి ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రధాని మోదీ బృందం సన్నాహాలు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల మద్దతు ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 362 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఎన్డీయేకు కనీసం మరో 99 మంది సభ్యులు తక్కువవుతారు. సభకు హాజరైన వారిలో రెండింట మూడో వంతు మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే బిల్లులు ఆమోదం పొందుతాయి. ఎన్డీయేకు ఉన్న సంఖ్యా బలానికి రెండింట మూడో వంతు మెజారిటీ రావాలంటే సభలో కనీసం 439 మంది సభ్యులుండాలి. ఇది జరగాలంటే దాదాపు 104 మంది సభ్యులు సభకు గైర్హాజరయ్యేలా చూడడం లేదా సభకు హాజరైనా ఓటు వేయకుండా చేయడమో చెయ్యాలి. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఎంతమందిని తమ వైపునకు నయానో భయానో తిప్పుకున్నా వందమందిని ఎలా బుజ్జగించగలమనే సందేహం బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. రాత్రికి రాత్రి ప్రలోభాలు పెట్టి లేదా కేసుల బూచి చూపి బెదిరిస్తే కానీ బీజేపీ వంద మంది సభ్యులను తమ వైపు తిప్పుకునే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తామంతా సంఘటితంగా ఉన్నామని, తమను ఎవరూ ప్రలోభపెట్టలేరని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 16 , 2026 | 03:16 AM