భూ వివాదంలో మోదీ స్నేహితుడికి ఊరట
ABN , Publish Date - Sep 17 , 2026 | 06:36 AM
భూవివాదంలో ప్రధాని మోదీ స్నేహితుడు అస్గర్ అలీ వోహ్రాకు ఉపశమనం లభించింది. వివాదాస్పద స్థలాన్ని ఖాళీ చేసేందుకు అక్కడ ఇంతకుముందు నిర్మాణాలు చేపట్టిన సంస్థ ముందుకు వచ్చింది.
వివాదాస్పద స్థలాన్ని ఖాళీ చేస్తామన్న నిర్మాణ సంస్థ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: భూవివాదంలో ప్రధాని మోదీ స్నేహితుడు అస్గర్ అలీ వోహ్రాకు ఉపశమనం లభించింది. వివాదాస్పద స్థలాన్ని ఖాళీ చేసేందుకు అక్కడ ఇంతకుముందు నిర్మాణాలు చేపట్టిన సంస్థ ముందుకు వచ్చింది. అస్గర్ అలీ ఇటీవల మోదీని కలిసి తన సమస్యను వివరించి, భూ ఆక్రమణపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరిన నేపథ్యంలోనే నిర్మాణ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గుజరాత్‌లోని వడ్‌నగర్ బీఎన్ హైస్కూల్‌లో మోదీతో కలిసి చదువుకున్న అస్గర్ అలీకి మహారాష్ట్రలోని థానే జిల్లా భయాందర్ ఈస్ట్ ప్రాంతంలో 2,810 చదరపు మీటర్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందిన ‘సెవెన్ ఎలెవన్ కన్‌స్ట్రక్షన్స్’ అనే నిర్మాణ సంస్థ, మరో డెవలపర్ కలిసి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారని అస్గర్ ఆరోపించారు. దీనిపై ఆయన కొన్నేళ్లుగా కోర్టులో పోరాటం చేస్తున్నారు. ఆయనపైన కూడా కేసులు నమోదయ్యాయి. కేసులు ఎంతకీ తేలకపోవడంతో అస్గర్ అలీ ఈ నెల 8న ప్రధానిని కలిశారు. ఈ నేపథ్యంలో, సెవెన్ ఎలెవెన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ బుధవారం మున్సిపల్ అధికారులకు లేఖ రాసింది. వివాదాస్పద స్థలంలో 1,405 చదరపు మీటర్ల స్థలాన్ని వేరే వాళ్ల దగ్గర నుంచి కొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని తెలిపింది. అయినప్పటికీ, తమ నిర్మాణ అనుమతులను రద్దు చేసుకుంటున్నామని, ఆ స్థలాన్ని ఖాళీ చేస్తామని పేర్కొంది. అస్గర్‌పై పెట్టిన కేసును కూడా వెనక్కి తీసుకోనున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా చెప్పారు.